
- ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగానే గద్దెల అభివృద్ధి
- మంత్రి సీతక్క
ములుగు/తాడ్వాయి, వెలుగు : సమ్మక్క, సారలమ్మల కీర్తిని విశ్వవ్యాప్తం చేసేందుకు యజ్ఞంలా పనిచేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి జరగనున్న మహాజాతరలో భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొత్త రోడ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఎస్పీ శబరీశ్‌తో కలిసి ఆదివారం కొండపర్తి నుంచి గోనెపల్లి, ముత్తాపురం మీదుగా పడికాపురం, కాల్వపల్లి నుంచి కన్నెపల్లి రహదారులను పరిశీలించారు.
అలాగే భూపాలపల్లి నుంచి బయ్యక్కపేట మీదుగా, పస్రా నుంచి నార్లాపూర్ మీదుగా, తాడ్వాయి నుంచి మేడారం వైపు, ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి నుంచి ఊరట్టం మీదుగా మేడారం వచ్చే రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మేడారం వచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలను తీర్చేలా, ఎడ్లబండ్ల బాటలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయో లేదో పరిశీలించామని, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎడ్లబండ్ల బాటలు, సింగిల్ రోడ్లను సైతం అభివృద్ధి చేసి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు.. డైవర్ట్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రోడ్లకు సంబంధించిన పనులను జిల్లా యంత్రాంగం వేగంగా పూర్తి చేస్తోందని చెప్పారు. చత్తీస్‌గఢ్, ఖమ్మం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం చిన్నబోయినపల్లి మీదుగా ఊరట్టం వరకు ఉన్న రోడ్డును సైతం విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహాజాతర లోపు కొండాయి వాగు బ్రిడ్జిని పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవుడి పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, వారి ప్రచారాన్ని నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆదివాసీ పూజారుల ఆలోచనలు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగానే గద్దెలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
అనంతరం మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడారు. పర్యటన సందర్భంగా వివిధ ప్రాంతాలకు మంత్రి కాన్వాయం వెళ్లలేకపోవడంతో ఎస్పీ శబరీశ్‌తో కలిసి బుల్లెట్ బైక్‌పై పర్యటించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, ములుగు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ములుగు డీఎస్పీ ఎన్.రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.