
- అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు ఆదేశం
- బాచుపల్లి-గండిమైసమ్మ, బహదూర్ పల్లి-కొంపల్లి రోడ్ల నిర్మాణంపై రివ్యూ
హైదరాబాద్, వెలుగు: రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్ భూమి, ఫారెస్టేతర భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.సెప్టెంబర్ మొదటి వారంలో బాచుపల్లి నుంచి -గండిమైసమ్మ ఆరు వరుసల రోడ్డు, బహదూర్‌పల్లి నుంచి దూలపల్లి మీదుగా కొంపల్లి వరకు రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన జరిగేలా యుద్ధ ప్రాతిపదికన అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు.
శుక్రవారం సెక్రటేరియెట్‌లో అటవీశాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ సువర్ణ, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ నవాజ్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ కొంపల్లి, మేడ్చల్ అదనపు కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశం అయ్యారు.
బాచుపల్లి నుంచి -గండిమైసమ్మ రోడ్డు, బహదూర్‌పల్లి నుంచి కొంపల్లి రోడ్డు నిర్మాణాలకు సంబంధించి అటవీ భూమి బదలాయింపుపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రోడ్ల నిర్మాణానికి అటవీశాఖకు చెందిన 19 ఎకరాల భూమి బదలాయింపుకు సంబంధించిన మొదటి దశ ఫార్మాటిలిటీస్ను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు పరిహారంగా ఇచ్చే నిధులను సిద్ధం చేయాలని చెప్పారు. సుభాశ్ నగర్ పైప్‌లైన్ రోడ్డు, సెయింట్ యాన్స్ స్కూల్ రోడ్డు నిర్మాణ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.