
- యూఎస్ ఇండియానా స్టేట్ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్‌బాబు రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ అనుకూల వాతావరణమని..ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని అమెరికాలోని ఇండియానా రాష్ట్రానికి చెందిన ప్రతినిధులను ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ‘ఇండియానా సెక్రటరీ ఆఫ్ స్టేట్’ డియాగో మోరాలెస్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సహాకాలను మంత్రి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు.
ఈ ఏడాది దావోస్ పర్యటనలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు హబ్ గా మారుతున్న తెలంగాణ వైపు యావత్తు ప్రపంచం చూస్తున్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. నాణ్యమైన మానవ వనరులను అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్శిటీని ప్రారంభించాం. నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగినట్లు కోర్సులను అందిస్తున్నాం. ఐటీ రంగంలోనే కాకుండా బయోటెక్, ఫార్మా తదితర రంగాల్లోనూ తెలంగాణ గ్లోబల్ మార్కెట్ లో అత్యుత్తమ స్థానంలో ఉంది’’ అని శ్రీధర్ బాబు వివరించారు.