సంక్షేమంలో తెలంగాణకు దేశంలోనే మొదటి స్థానం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సంక్షేమంలో తెలంగాణకు దేశంలోనే మొదటి స్థానం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్,వెలుగు: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్లు రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌‌నగర్‌‌లో రూ.11.9 కోట్లతో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ నిర్మాణాలను, పట్టణ శివారులోని రామస్వామి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో నిర్మిస్తున్న మోడల్ కాలనీలోని  2,160 గృహాలను, ప్రభుత్వ ఐటీఐ కాలేజీ, ఇరిగేషన్, ఆర్అండ్‌బీ బిల్డింగ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్‌కు ప్రాధాన్యమిస్తోందన్నారు. 

హుజూర్‌‌నగర్ నియోజకవర్గంలోని పాలకీడు మండలం జాన్‌పహాడ్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించానని, డిసెంబర్ 31 నాటికి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి 10వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వ చివర భూములు 53వేల ఎకరాలకు సాగునీరు అందించేలా పనులు జరుగుతున్నాయని, ఈ ప్రాజెక్ట్స్​కు మహాత్మాగాంధీ ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నామన్నారు. దొండపాడు లో నిర్మిస్తున్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్  ద్వారా 14వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. 

యువతకు ఉన్నత విద్య ఉపాధి అవకాశాల కోసం రూ. 6 కోట్లతో బేసిక్ ఐటీఐ కాలేజ్, రూ.40 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవనం, మిషనరీ మంజూరు చేసినట్లు చెప్పారు. అనంతరం ఎంపీడీవో ఆఫీసులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఆర్డీవో శ్రీనివాసులు, ఏటీసీ కాలేజీ ప్రిన్సిపాల్ లక్ష్మణ చారి, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, తహసీల్దార్‌‌ నాగార్జున రెడ్డి ఎంపీడీవో లావణ్య, తదితరులు పాల్గొన్నారు.