కేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి

 కేంద్రం వల్లే తెలంగాణలో యూరియా కొరత: మంత్రి వివేక్ వెంకటస్వామి

యూరియా కొరత కేంద్ర సమస్య అని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఉత్కుర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వివేక్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమంతో పాటు రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. 

 కేంద్ర ప్రభుత్వం యూరియా పంపిస్తేనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తుందన్నారు.  మోడీ అవలంబిస్తున్న విధానాల వల్ల విదేశాల నుంచి యూరియా దేశానికి రావడం లేదని చెప్పారు మంత్రి వివేక్.  యూరియా అందకపోవడంతో  రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.   మంచిర్యాల జిల్లాకు యూరియా కోట పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరానని చెప్పారు.  త్వరలోనే రైతులందరికీ యూరియా అందేలా చర్యలు చేపడతామన్నారు మంత్రి వివేక్.

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్రమంత్రిని కలిసి రాష్ట్రానికి యూరియా కొరత లేకుండా చూడాలని కోరారని చెప్పారు మంత్రి వివేక్.  రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను త్వరితగతిన పంపించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారని తెలిపారు.  ఎంపీ వంశీకృష్ణ రైల్వే శాఖ మంత్రిని కలిసి మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్  ఆగేలా చర్య లు  చేపట్టాలని కోరారని చెప్పారు.  వంశీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి రైల్వే సమస్యలపై పోరాటం చేస్తూ ప్రయాణికుల సమస్యలు తీర్చుతున్నారని వివేక్ అన్నారు.