
సదాశివనగర్, వెలుగు : ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందించడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని, ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ పనుల కోసం రూ.23 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. గురువారం భూంపల్లి గ్రామ శివారులోని ప్రాజెక్ట్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన 14 రోజుల్లోనే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ నిర్వహించానన్నారు.
రెండు సార్లు ప్రాజెక్ట్‌పై అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. ప్రాజెక్ట్ పూర్తైతే సదాశివనగర్ మండలంలో 24,590 ఎకరాలు, గాంధారి మండలంలో 13,546 ఎకరాలు, రామారెడ్డి8,664 ఎకరాలు, రాజంపేట 2,593 ఎకరాలు, లింగంపేట 22,934, ఎల్లారెడ్డి 3,200, నాగిరెడ్డిపేట 3,100 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు సంగారెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, సొసైటీ చైర్మన్లు గంగాధర్, సదాశివరెడ్డి, మాజీ సర్పంచ్‌లు రవీందర్ గౌడ్, లింగారెడ్డి, భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీలు శ్రీనివాస్ రెడ్డి, రూపేందర్ రెడ్డి పాల్గొన్నారు.
పాడి రైతుల సంక్షేమానికి కృషి
తాడ్వాయి, వెలుగు : పాడి రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. గురువారం మండలంలోని ఎర్రపహడ్ గ్రామంలోని మా గార్డెన్ లో బీఎంసీ సామర్థ్యం పెంపు, పాలసేకరణ పెంపుపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో తాడ్వాయి మండలానికి పాల ఉత్పత్తిలో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నష్టాల్లో ఉన్న విజయ డైయిరీని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో విజయ డైయిరీ రాష్ట్ర చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కామారెడ్డి జిల్లా డిప్యుటీ డైరెక్టర్ నందకుమారి, అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం కిష్టారెడ్డి, బీఎంసీ మేనేజర్ పీసు రవీందర్ రెడ్డి, సూపర్ వైజర్ సంజీవ్ పాల్గొన్నారు.