
పాలకుర్తి, వెలుగు: చెరువులు బలపడితేనే గ్రామాలు బాగుపడుతాయని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు చెరువులో ఇటీవల ఇరిగేషన్ శాఖ రూ.17 లక్షలతో మత్తడి మరమ్మతు పనులు పూర్తి చేసి, 4 ఎల్ కెనాల్ నుంచి నల్లకుంట మీదుగా వచ్చిన నీటితో చెరువును నింపారు. మంగళవారం ఎమ్మెల్యే చెరువు మత్తడిని సందర్శించి, పూజలు చేశారు.
అనంతరం దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో వాన కొండయ్య గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఇటీవల రూ.కోటి మంజూరు చేయగా, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆమె వెంట బ్లాక్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండలాధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, నల్లా శ్రీరాములు, నాయకులు తదితరులున్నారు.