నెరవేరిన పేదల సొంతింటి కల : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

నెరవేరిన పేదల సొంతింటి కల : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
  • అంకాపూర్​లో గృహ ప్రవేశాలు చేయించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్

ఆర్మూర్, వెలుగు : మండలంలోని అంకాపూర్‌లో శుక్రవారం కలెక్టర్ వినయ్‌ కృష్ణారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి 92 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి గృహప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన ఇళ్లతో పాటు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను అర్హులకు త్వరలో కేటాయిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు దశల వారీగా జమ చేస్తామన్నారు.   

ఇళ్ల పంపిణీ సంతోషకరం

ఆదర్శ గ్రామం అంకాపూర్‌ నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ ప్రారంభించడం సంతోషకరమని ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డి అన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందన్నారు.  అంకాపూర్‌ రైతులు పంట మార్పిడి పద్ధతులను పాటిస్తూ, నూతన వంగడాల దిశగా ముందడుగు వేయాలన్నారు.

మిగిలినవారికి త్వరలో అందజేస్తాంఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి 

డబుల్​ బెడ్​ రూం ఇండ్ల పంపిణీతో అంకాపూర్​ గ్రామంలోని పేదల సొంతింటి కల నెరవేరిందని  ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. ఇప్పటికే మెజార్టీ కుటుంబాలకు ఇండ్లు అందించామని, మిగతా కుటుంబాలకు త్వరలో కేటాయిస్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నందిపేట్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం అంకాపూర్‌లో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ కలిసి శంకుస్థాపన చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్‌ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్​రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, హౌసింగ్ పీడీ పవన్ కుమార్ పాల్గొన్నారు.