ముంపు ప్రాంతాలను ముందే గుర్తించండి

ముంపు ప్రాంతాలను ముందే గుర్తించండి

హనుమకొండ, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, విద్యుత్, పోలీస్, అగ్నిమాపక, వ్యవసాయ, ఆర్అండ్ బీ తదితర శాఖల అధికారులతో వరద ముప్పు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమావేశమయ్యారు.  ముంపు ప్రాంతాలను ముందే గుర్తించాలని సూచించారు. రోడ్లు ఎక్కడెక్కడ తెగిపోయే అవకాశం ఉందో చూడాలన్నారు. చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన పాత భవనాలను గుర్తించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా మందులు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. 

కలెక్టరేట్​లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇన్​చార్జి అడిషనల్​కలెక్టర్లు వైవీ.గణేశ్, మేన శ్రీను, డీసీపీ సలీమా, సీపీవో సత్యనారాయణరెడ్డి, డీఏవో రవీందర్ సింగ్, డీపీవో లక్ష్మి రమాకాంత్, డీఎంహెచ్ వో  అప్పయ్య, ఆర్డీవో నారాయణ తదితరులున్నారు 

లింగ నిర్ధారణ పరీక్షలపై ఫిర్యాదుకు వాట్సాప్ నంబర్

ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ఇందుకోసం సోమవారం తన చాంబర్​లో వాట్సాప్​నంబర్​ఆవిష్కరించారు. లింగ నిర్ధారణ, అబార్షన్లకు సంబంధించిన సమాచారాన్ని 6300030940 నంబర్​కు వాట్సాప్ ద్వారా తెలియజేయాలన్నారు. 104, 181,1098, డయల్ 100 టోల్ ఫ్రీ నంబర్లకు, pndtmtpcomplaintsdmhohnk@gmail కి కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డీఎంహెచ్​వో అప్పయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి, మాతాశిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.