ఉభయ సభలు నిరవధిక వాయిదా

ఉభయ సభలు నిరవధిక వాయిదా

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగిశాయి. రాజ్య సభ,  లోక్‌సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.  లోక్ సభ నిరవధిక వాయిదాను స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  జూలై 20న ప్రారంభమయ్యాయి. ఈ  సమావేశాల్లో మొత్తం 17 సార్లు సభ సమావేశమైంది. 44 గంటల 15 నిమిషాలు సభ పనిచేసిందని స్పీకర్ ఓ బిర్లా వివరించారు. లోక్ సభలో  20 బిల్లులను  ప్రవేశపెట్టగా.. 22 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారు. సభాకార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించిన ప్రధాని మోదీ, అన్ని పార్టీల నేతలు, ఎంపీలకు ఓం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు.


ఆఖరి రోజు ఆగస్టు 11వ తేదీ ఉభయ సభలు   ప్రారంభం కాగానే కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ సస్పెన్షన్ పై విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రతిపక్షాల నిరసనల మధ్యే లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు  వాయిదా పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం  12 గంటలకు సభ ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే  కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్  జీఎస్‌టీ  సవరణ బిల్లు 2023,  ఇంటిగ్రేటేడ్  గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లు 2023 లను ప్రవేశ పెట్టారు. ఈ సమయంలో విపక్షాలు తమ నిరసనను కొనసాగించారు. ఆ తర్వాత  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  ఐపీసీ, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ , ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బిల్లులను  ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుల గురించి సభలో  కేంద్ర హోంశాఖ మంత్రి  వివరించారు. ఈ  సమయంలో విపక్షాలు సభలో లేవు. అంతకు ముందే సభ నుండి విపక్ష ఎంపీలు   వాకౌట్ చేశారు.