Moral Story : తెలివైన కుందేలు... సింహం ఆట ఎలా కట్టించిందో తెలుసుకోండి.. 

Moral Story : తెలివైన కుందేలు... సింహం ఆట ఎలా కట్టించిందో తెలుసుకోండి.. 

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఏ క్రూరమృగం లేకపోవటం వల్ల జంతువులన్నీ హాయిగా, ఆనందంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోని తెలివైన కుందేలు చాలా సంతోషించి ‘ఇక నాకు ఎదురే లేద’ని భావించింది. ఒకరోజు ఒక సింహం ఎక్కడి నుంచో వచ్చి ఆ అడవిలో ప్రవేశించింది. అక్కడ జంతువుల్ని ఎడాపెడా వేటాడి చంపి తింటూ ఆనందించసాగింది. జంతువులన్నీ హడలిపోయాయి. అన్నీ కలిసి కుందేలు దగ్గరకు వెళ్లి, తమ గోడు వెళ్లబోసుకున్నాయి. 

‘‘అవునా! మన అడవిలోకి క్రూరమృగమైన సింహం ప్రవేశించిందా? ఈ సంగతి మీరు చెప్పేదాకా ఇప్పటివరకు నాకు తెలియదు” అని తెలివైన కుందేలు ఆశ్చర్యపోయి కొద్దిసేపు ఆలోచించి, జంతువుల్ని వెంట బెట్టుకొని వెళ్లి సింహాన్ని కలిసింది. 

‘‘సింహంగారూ నమస్కారం. మా అడవికి రాజు లేక మేము చాలా బాధ పడుతున్నాం. మీ  రాకతో మా జన్మ ధన్యమయింది. మా అడవి పునీతమయింది. మిమ్మల్ని రాజుగా ఎన్నుకుందాం అనుకుంటున్నాం. ఈ రోజు అన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. రేపు వచ్చి మిమ్మల్ని జయజయ ధ్వానాలతో తీసుకెళ్తాం. మీరు దయజేసి రేపు మాతో వచ్చి సింహాసనం మీద ఆసీనులు కావాలి” అంది. దానికి సింహం ఆనందంతో ఎగిరి గంతేసినంత పనిచేసి.. ‘అలాగే’ అంది. కుందేలు నిర్ణయానికి జంతువులన్నీ హడలిపోయాయి. అయినా ‘తెలివైన కుందేలు కదా. ఏంచేస్తుందో చూద్దాం!’ అని మనస్సులో అనుకొని, కుందేలుతోపాటు అన్నీ వాటివాటి స్థానాలకి వెళ్లిపోయాయి. 

మరుసటి రోజు కుందేలు పూలబాట మీద సింహాన్ని నడిపించుకుంటూ జయజయద్వానాలతో, మిగతా జంతువులతో పూలు చల్లించుకుంటూ గౌరవ మర్యాదలతో సింహాసనం దగ్గరకి తీసుకెళ్లింది. సింహం దర్జాగా వెళ్లి గర్వంతో సింహాసనం మీద ఆసీనురాలైంది. అంతే! సింహాసనం కుప్ప కూలింది. సింహాసనంతోపాటు దాని మీద కూర్చున్న సింహం కూడా గుంతంలోకి కుప్పకూలింది. 

జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి.  ఆనందంతో ఎగిరి గంతులేస్తూ.. ‘‘ఇది ఎలా జరిగింది?’’ అని ప్రశ్నించాయి. ‘‘మన వడ్రంగి ఎలుగు బంటిగారితో సింహాసనం తయారుచేయించా. వారితోనే పూలబాట ఏర్పాటు చేయించా. పూలబాటకి చివర పెద్ద గొయ్యి తవ్వించి, దానిమీద ఎండుపుల్లలు పెట్టించి, ఆ పుల్లల మీద ఆకులు పరిపించి, ఆకుల మీద పూలు చల్లించి, దాని మీద సింహాసనం పెట్టించాను. సింహం వచ్చి ఎక్కగానే దాని బరువుకి కింద ఉన్న ఎండుపుల్లలు పుటుక్కున విరిగిపోయాయి. దాంతో సింహాసనం, సింహం గోతిలో పడ్డాయి” అని వివరించింది కుందేలు. 

లోతైన పెద్ద గోతిలో పడ్డ సింహం భయంతో వణికిపోతూ ‘‘ఇక్కడ ఏ క్రూర మృగం లేదు. నా ఆటలు బాగా సాగుతాయని, నా కండ బలంతో విర్రవీగుతూ ఇక్కడకు వచ్చా. మీకు ఎంతో హాని చేశాను. కండబలం కన్నా బుద్ధి బలం మిన్న అని మీరు నిరూపించారు. నా ఆటలు కట్టించారు. నాకు బుద్ధి వచ్చింది. దయచేసి నన్ను కాపాడండి. ఇక్కడ ఉండకుండా వెళ్లిపోతాను’’ అని లోపలి నుంచి దీనంగా వేడుకుంది.

కుందేలు మనసు కరిగిపోయింది. ‘కష్టాల్లో ఉన్నప్పుడు శత్రువునైనా సరే కాపాడాలి’ అని తన చిన్నతనంలో వాళ్లమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏనుగుని కాపాడమని ఆదేశించింది. ఏనుగు తన కాళ్ల మీద కూర్చొని, తన తొండంతో సింహాన్ని చుట్టి బయటకు లాగింది. బయటపడ్డ సింహం కుందేలుకు వినయంతో నమస్కరించి, తలవంచుకుని అక్కడి నుంచి సిగ్గుతో వెళ్లిపోయింది. సింహం పీడ విరగడ చేసిన కుందేలు తెలివిని జంతువులన్నీ ఎంతగానో మెచ్చుకున్నాయి. ఆనందంతో నృత్యం చేశాయి.

- మా. శ్రీ రాజు పాల్వంచ -