గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు రఘురామకృష్ణరాజు తరలింపు

 గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు రఘురామకృష్ణరాజు తరలింపు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జైలు నుంచి హైదరాబాద్ కు తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కొద్దిసేపటి క్రితం గుంటూరు జైలుకు చేరుకున్న ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణరాజును జైలు నుంచి బయటకు తీసుకొచ్చి హైదరాబాద్ కు బయలుదేరారు. పోలీసు వాహనంలో కాకుండా సొంత కారులో వచ్చేందుకు ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీఐడీ అధికారులు అనుమతించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామకృష్ణరాజును తరలిస్తున్న సీఐడీ అధికారులు అర్ధరాత్రి సమయానికి  సికింద్రాబాద్ చేరుకునే అవకాశం ఉంది. సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అరెస్టు చేసిన సందర్భంగా సీఐడీ పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తీవ్రంగా హింసించారని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టుతోపాటు, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు లో తీవ్ర వాదనల అనంతరం బెయిల్ పిటిషన్ వచ్చే శుక్రవారానికి వాయిదా పడింది. అయితే అంతవరకు రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి జ్యుడీషియల్ అధికారి సమక్షంలో మెడికల్ బోర్డు  వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలిచ్చింది. తమ ఆదేశాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఏపీ చీఫ్ సెక్రెటరీతోపాటు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సుప్రీం కోర్టు  ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఏపీ సీఐడీ అధికారులు సుప్రీం ఆదేశాల అమలు ప్రారంభించారు.