
- బాధ్యులపై చర్యలు తీసుకోండి
- విజిలెన్స్‌కు ఎంపీ చామల కిరణ్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ ( హెచ్ సీఏ ) లో జరుగుతున్న పలు అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు ఆయన ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో మీడియాకు వివరించారు. హెచ్‌సీఏలో క్యాటరింగ్, ట్రాన్స్‌పోర్టు సేవల కోసం ఎలాంటి టెండర్లను పిలవకుండానే నేరుగా కాంట్రాక్ట్ లు అప్పగించడంపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
అపెక్స్ కౌన్సిల్‌తో సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాధికారాలు కొంతమంది(అధ్యక్ష, సెక్రటరీ) వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. క్యాటరింగ్, ట్రాన్స్‌పోర్టు సేవల కోసం అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా, ఇందులో ఎలాంటి న్యాయబద్ధత, జవాబుదారీతనాన్ని చూపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు చెప్పారు. హెచ్‌సీఏలో పలు సమస్యలు ఉన్నాయన్నారు.
ముందస్తు చర్చలు జరిపినా.. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో టర్ఫ్ వికెట్ తయారీలో జాప్యం జరుగుతున్నదని అన్నారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో రద్దీని తగ్గించడానికి, భద్రతను మెరుగుపరచడానికి, పార్కింగ్ ఏర్పాటు వంటివాటిపై దృష్టిపెట్టాలని కోరారు. హెచ్‌సీఏ ప్రతిష్టను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ను
కోరినట్టు చెప్పారు.