
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : రైతు సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం యూపీలోని వారణాసిలో పీఎం కిసాన్ సమ్మాన్యోజన్ 20వ విడత విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మపూర్ రైతు వేదికలో ఎంపీ, అధికారులు,పార్టీ కార్యకర్తలు, రైతులతో కలిసి వర్చువల్ గా వీక్షించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలోని 65,996 మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు.
రైతుల ఖాతాల్లో మూడు విడతల్లో రూ.6 వేలను కేంద్ర సర్కార్ జమ చేస్తుందన్నారు. ఏడాదిలో ఎకరాకు రూ.18 వేల సబ్సిడీతో ఎరువులు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి, మండల ఇన్చార్జి శేరి పాండురంగారెడ్డి, బీజేపీ మండలాధ్యక్షుడు బొంగు గంగన్న, మండల ప్రధాన కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్, నరేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు దేశం మహేశ్‌గౌడ్, సీనియర్ నాయకులు రాజు గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, జాం శ్రీనివాసులు,శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
పాలమూరు, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సత్తా చాటాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని న్యూ గంజ్ లో మాజీ కౌన్సిలర్ పెద్ద నర్సింహులు తోపాటు అనుచరులు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర ఫలాలు అందాలంటే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.