- ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఖిలా వరంగల్ (మామునూరు), వెలుగు : విమానాశ్రయం నిర్మాణంతో త్వరలో ఓరుగల్లు ప్రజల కల నెరవేరబోతోందని ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. గురువారం మామునూర్ ఎయిర్ రన్ వే విస్తరణ పనులను కలెక్టర్ సత్యశారదతో కలిసి ఆమె పరిశీలించారు. నక్కలపల్లి చెరువు, గాడిపల్లి చెరువులతోపాటు ఎయిర్ పోర్టుకు వెళ్లే రోడ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వరదలను దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌పోర్టు పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణకు సంబంధించిన పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో విమనాశ్రయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రయాణికుల సేవలతోపాటు కార్గో సేవలను సైతం అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని చెప్పారు.
