మున్సిపల్ రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ

మున్సిపల్ రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ
  • రిజర్వేషన్లపై ఆశావహుల ఆసక్తి
  • కుదరకపోతే సతీమణుల రంగ ప్రవేశం

వనపర్తి, వెలుగు : మున్సిపల్​ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ముసాయిదా ఓటరు జాబితా వెల్లడితో స్పష్టత వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పందొమ్మిది మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్​లో ఎన్నికలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  ఇంకా ఎన్నికల నోటిఫికేషన్​ రాకముందే ఆయా మున్సిపాలిటీలలో చైర్మన్​, వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లపై ఆశావహులు ఆరా తీస్తున్నారు. ఏ వార్డు ఏ కేటగిరీకి రిజర్వు అవుతుంది? ఏ మున్సిపాలిటీ ఛైర్మన్​ ఏ కేటగిరీకి రిజర్వు అవుతుంది? అంటూ ఎదురు చూస్తున్నారు. 

రిజర్వేషన్లపై లెక్కలు .. 

గత ఎన్నికలలో కేటాయించిన రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుంటూ ఈసారి మారే అవకాశముందని కొందరు, లేదు అవే ఉంటాయని మరికొందరు చర్చించుకుంటున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో మాదిరిగానే రోస్టర్​ విధానంలో రిజర్వేషన్లు ఉంటాయా? లేక పదేళ్లపాటు ఒకే కేటగిరీ రిజర్వు ఉంటుందా అంటూ ఆయా పార్టీలలో చర్చ నడుస్తోంది. దీనిలో భాగంగా ఆశావహులు మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతూ రిజర్వేషన్ల గురించి   ఆరా తీస్తున్నారు. రిజర్వేషన్లు  మున్సిపల్​ అడ్మినిస్ర్టేషన్​ కార్యాలయంలోనే తీస్తారని, ఇక్కడ ఏమీ ఉండవని అధికారులు చెబుతున్నా, తమకు నచ్చిన వార్డు తమ కేటగిరీకే రాకపోతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

 ఇదిలా ఉండగా.. వనపర్తి మున్సిపల్ చైర్మన్​గిరి 2014లో  జనరల్​కు వచ్చింది.  అయితే బీఆర్​ఎస్​ ప్రభుత్వం  రెండు టర్ములూ ఒకే కేటగిరీ రిజర్వేషన్లు ఉండాలంటూ జీవో తీసుకురాగా..  2019లో చైర్మన్​ స్థానం బీసీ జనరల్​ కు  దక్కింది. ఈ లెక్కన చూసుకున్నా..  ఉమ్మడి పాలమూరు జిల్లాలో   బీసీ జనరల్​ రిజర్వేషన్​  ఏ మున్సిపల్​  చైర్మన్ స్థానానికి  కేటాయించారో..  ఈసారీ అలాగే ఉండాలని ఆశావహులు కోరుకుంటుండగా..  మరో వైపు ఏం జరుగుతుందోనని ఎదురుచూస్తున్నారు. మహిళల రిజర్వేషన్లు వచ్చిన చోట్ల  సమీప బంధువులు, సతీమణులను నిలబెట్టాలని
యోచిస్తున్నారు. 

అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధికం

మహబూబ్​నగర్​ జిల్లాలోని ఒక కార్పొరేషన్​, రెండు మున్సిపాలిటీల్లో 2853 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. వనపర్తి జిల్లాలో అయిదు మున్సిపాలిటీలుండగా 2410, జోగులాంబ గద్వాల జిల్లాలో నాలుగుమున్సిపాలిటీలుండగా 2737, నారాయణపేట జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుండగా 2040, నాగర్​కర్నూలు జిల్లాలో మూడు మున్సిపాలిటీలుండగా కొల్లాపూరు మినహా మిగతా రెండింటిలో 530 మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి పాలమూరుజిల్లాలో మొత్తం 35 మంది థర్డ్​ జెండర్​ ఓటర్లున్నారు.