
- ప్రభుత్వ ఉద్యోగులకు కలెక్టర్ ఆదేశాలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లాలో తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లోకి వచ్చిందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు షెడ్యులు సోమవారం విడుదల చేయడంతో తక్షణమే కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల కొత్త ప్రాజెక్టులు మంజూరులో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు. కింది స్థాయి నుంచి కలెక్టర్ వరకు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ సిబ్బంది సహ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పనిచేయాలని కోరారు. ఎట్టి పరిస్థితులో రాజకీయ నాయకులతో కార్యక్రమంలో పాల్గొనవద్దని హెచ్చరించారు. ప్రచార పోస్టర్లు బ్యానర్లు ప్లెక్సీలు, గోడ రాతలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా నిష్పక్షపాతంగా అధికారులు పని చేయాలన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కంప్లైంట్‌లు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటనే సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి పరిష్కరించాలన్నారు. భూసంబంధిత ఇబ్బందులు, సంక్షేమ పథకాల సమస్యలు, గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతుల సమస్యల అంశాలపై ఫిర్యాదులు ఎక్కువగా నమోదైనట్లు పేర్కొన్నారు. కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.