టీఆర్​ఎస్​లో నాగార్జునసాగర్​ టెన్షన్

టీఆర్​ఎస్​లో నాగార్జునసాగర్​ టెన్షన్
  • అంచనాలు తప్పుతాయేమోనని అనుమానం​
  • అందుకే బై పోల్​ రిజల్ట్స్​ కన్నా ముందే మున్సిపోల్స్

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  లీడర్లకు నాగార్జునసాగర్  టెన్షన్ పట్టుకుంది. ఉప ఎన్నికలో గెలుస్తామా? లేదా? అని భయపడుతున్నారు.  సెగ్మెంట్ లోని మండలాలు, గ్రామాల వారీగా పోలైన ఓట్ల వివరాలు తెప్పించుకొని ఒకటికి రెండు సార్లు  పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు వరకు మంచి మెజార్జీతో గెలుస్తామని ధీమాగా ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ మాట అటుంచి అసలు గెలుస్తామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో లీడర్లు పనిచేసినా, కోట్లలో ఖర్చు చేసినా అనుకున్నట్టుగా రిజల్ట్ ఉండకపోవచ్చని ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన లీడర్లు చర్చించుకుంటున్నారు. 
సర్వేలు, రిపోర్టులు చూసి..
సీఎం కేసీఆర్ బహిరంగ సభ తర్వాత మంచి మెజార్టీతో గెలుస్తామని ఎన్నికల బాధ్యతలు చూసిన లీడర్లు చెప్పారు. కానీ ఓటింగ్ తర్వాత తమ అంచనాలు తప్పే చాన్స్​ ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టులు, టీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రైవేటు సర్వే సంస్థలు రూపొందించిన నివేదికలు చూస్తే అంచనాలు తప్పే ప్రమాదం ఉందని అంటున్నారు. ‘‘గొప్ప మెజార్టీ రాకపోవచ్చు.  అత్తెసరు ఓట్లుతోనే బయటపడే చాన్స్ ఉంది. ఒకవేళ గెలిచినా మాది  ఏకపక్ష విజయం కాదు’’ అని ఎన్నికల బాధ్యతలు చూసిన ఓ మంత్రి వివరించారు. కేసీఆర్ బహిరంగ సభ రోజునే పరిస్థితి తమకు అర్థమైందని ఆయన అన్నారు. 
ముందు నుంచే ఫోకస్ పెట్టినా..!
సాగర్​ ఎన్నికల షెడ్యూల్​ కంటే  15 రోజుల ముందు నుంచి సెగ్మెంట్​పై సీఎం కేసీఆర్​ ఫోకస్​ పెట్టారు. ఏఏ మండలాల్లో పార్టీ బలహీనంగా ఉందో లెక్కలు తీశారు. కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి వెంట ఉండే లీడర్ల వివరాలను ఆరా తీశారు. మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్​చార్జ్​గా నియమించి, జానారెడ్డిని బలహీనం చేసే పనిలో పడ్డారు. నామినేషన్ల ముగిసిన తర్వాత నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేవరకు దాదాపు 1,500 మంది టీఆర్​ఎస్​ లీడర్లు సాగర్​ నియోజకవర్గంలో మకాం వేశారు. కాంగ్రెస్ లోని లీడర్లకు డబ్బులు ఆశచూపి టీఆర్​ఎస్​లో  చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  ప్రతి గ్రామంలో కులాల వారీగా ఓటర్లను విభజించి పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు ప్రచారంలో ఉంది. ఇంత చేసినా గెలుపు దక్కుతుందా? లేదా? అనే అనుమానం టీఆర్​ఎస్​ లీడర్లలో కనిపిస్తోంది. 
మున్సిపోల్స్​పై ఎఫెక్ట్ పడకుండా..!
పైకి చెప్పుకునేంత అనుకూల పరిస్థితులు నాగార్జునసాగర్ లో టీఆర్​ఎస్​కు లేవనే విషయాన్ని సీఎం కేసీఆర్ ముందుగానే పసిగట్టినట్టు పార్టీ లీడర్లు అంటున్నారు. అందుకే సాగర్  రిజల్ట్స్ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడకుండా.. సాగర్​ రిజల్ట్స్​ కన్నా ముందే  వరంగల్​, ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్​కు ప్లాన్​ చేసినట్లు వారు చెప్తున్నారు. సాగర్  బైపోల్​ రిజల్ట్స్​  మే 2న రానుంది. మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ ఈ నెల 30న జరుగనుంది. సాగర్ లో ఎలాంటి ఫలితం వచ్చినా ఆ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై పడకూడదనే మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ తేదీలో జాగ్రత్త తీసుకున్నట్టు టీఆర్​ఎస్​ లీడర్లు  చెప్తున్నారు.