- రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
- నల్గొండలో మాత్రం స్వల్పంగా పెరిగిన రాబడి
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో రియల్ ఎస్టేట్ తగ్గినా రిజిస్ట్రేషన్ శాఖకు మాత్రం గతేడాది కంటే ఆదాయం స్వల్ప౦గా పెరిగింది. రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రమంతటా ఆదాయం తగ్గితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో చాలా జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. ఆదాయం కూడా తగ్గింది. నల్లగొండ జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గినా.. రూ. 7 కోట్ల మేర ఆదాయం పెరిగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2023–-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ. 412. 36 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2024 –- 25 ఆర్థిక సంవత్సరంలో 1,38,729 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ. 419 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం కంటే జిల్లాలో 4,699 డాక్యుమెంట్లు తక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగినా ఆదాయం స్వల్పంగా పెరిగింది.
ఎల్ఆర్ఎస్ చెల్లించడంతో..
నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 9 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. హైడ్రా, ఎన్టీఎల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది.
అనుమతి లేని వెంచర్ల ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గి చాలా వరకు ఆదాయం పడిపోయింది. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం పెరుగుతూ వచ్చింది.
మార్టిగేజ్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ఎక్కువ
మార్టిగేజ్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన రిజిస్ట్రేషన్లలో 30 శాతం మార్టిగేజ్ డాక్యుమెంట్లు ఉంటున్నాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వడ్డీపై ఇంటి స్థలాలు, ఇళ్లు, అగ్రికల్చర్ భూములపై వడ్డీలకు లోన్లు అందిస్తున్నాయి. అందుకోసం వారికి జమానత్ ఉండటానికి డాక్యుమెంట్లు పెట్టుకొని బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు మార్టిగేజ్ చేయించుకుంటున్నాయి.
తక్షణ అవసరాల కోసం రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు లోన్లు తీసుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 15 రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మార్టిగేజ్ రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రాలయిన నల్గొండ, సూర్యాపేట రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ విలువ కంటే భూముల ధరలు నాలుగైదు రేట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో మార్టిగేజ్ చేసుకొని లోన్లు తీసుకుంటున్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు.
రిజిస్ట్రేషన్ల వివరాలు 2024-25 2025-26 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు
సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్లు ఆదాయం రిజిస్ట్రేషన్లు ఆదాయం
నల్గొండ 20,058 64,85 కోట్లు 7970 25.22కోట్లు
సూర్యాపేట 18,707 41,20 కోట్లు 6907 17.86
కోదాడ 9,176 38,02 కోట్లు 3658 12.28
మిర్యాలగూడ 9,464 29,45 కోట్లు 3798 13.72
హుజూర్ నగర్ 6007 15,06 2252 5.42
నకిరేకల్ 4862 9,25 1960 3.70
నిడమనూర్ 5,718 8,53 2392 3.77
చండూరు 3,128 5,25 1553 2.72
