- ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్గొండ అర్బన్, వెలుగు: ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవారం నల్గొండలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ పై స్టూడెంట్లకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ, ఎప్పటికప్పుడు మీటింగ్స్ నిర్వహించి స్టూడెంట్స్ నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని, తమ తోటి విద్యార్థులతో సోదరభావంతో మెలగాలన్నారు. సీనియర్లు, జూనియర్లు అనే భేదం వీడనాడుతూ, నేటి సీనియర్లు ఒకప్పుడు జూనియర్లు అనే విషయం మరచిపోవద్దన్నారు.
తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే సంబంధిత పోలీస్ స్టేషన్, డయల్ 100 ద్వారా సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ కె. శివరాం రెడ్డి, ఎస్బీ సీఐ రాము, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై సైదులు, కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ రాధాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.
