అన్ని పంటలకూ నానో యూరియా

అన్ని పంటలకూ నానో యూరియా

నెలాఖరులో రాష్ట్ర రైతులకు అందుబాటులోకి వచ్చే చాన్స్‌‌
 తొలుత తక్కువ మొత్తంలోనే వినియోగంలోకి తేవాలని నిర్ణయం
 వచ్చే వారంలో సైంటిస్టులు, అధికారులు, ప్రోగ్రెసివ్ రైతులతో వెబినార్

హైదరాబాద్, వెలుగు: లిక్విడ్ రూపంలో లభించే నానో యూరియా రాష్ట్ర రైతులకు ఈ నెలఖారులోఅందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సాధారణ యూరియా చల్లుతున్న అన్ని పంటలకూ దీన్ని వాడొచ్చని సైంటిస్టులు, వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ ఖరీఫ్‌లోనే మార్కెట్లోకి రానుంది. అయితే మొదటిసారి మాత్రం సాధారణ యూరియానే వేసుకోవాలని ఇఫ్ కో కంపెనీతో పాటు అధికారులు చెబుతున్నారు. పత్తి, కంది వంటి పంటలకు దుక్కులు రెడీ చేసుకున్నప్పుడు లిక్విడ్ యూరియా  స్ర్పే చేయలేమని, పైపాటుగా మాత్రమే దీనిని వాడాలని సూచిస్తున్నారు. అలాగే వరి నాట్లు వేసే సమయంలో ఫస్ట్ డీఏపీ వేసుకోవాలని, ఆ తర్వాత రెండోసారికి పైపాటుగా నానో యూరియా వేసుకుంటే మేలని సైంటిస్టులు చెబుతున్నారు. 
ఖరీఫ్‌‌లో 10.50 లక్షల మెట్రిక్‌‌ టన్నులు అవసరం
తొలుత  ప్రోగ్రెసివ్ రైతులకు నానో యూరియాను అందజేయాలని అధికారులు  ప్లాన్ చేస్తున్నారు.  యూరియా  వినియోగంపై  వ్యవసాయాధికారులు, సైంటిస్టులు,  రైతులతో  ఇఫ్ కో కంపెనీ వెబినార్‌‌ను వచ్చే వారం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్ని లీటర్ల నానో యూరియా రాష్ట్రానికి తెప్పించాలనే దానిపై అధికారులకు స్పష్టత రానుంది.  జయశంకర్ అగ్రికల్చర్‌‌‌‌ వర్సిటీ కూడా నానో యూరియా వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలపై స్టడీ చేసింది. మంచి ఫలితాలే వచ్చాయని, అయితే దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్  ఇస్తామని  సైంటిస్టు ‘వెలుగు’కు తెలిపారు.  ఈ ఖరీఫ్ సీజన్‌‌లో 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు కూడా చేసింది. అయితే లిక్విడ్ యూరియా సక్సెస్ అయితే ప్రస్తుతం వినియోగంలో ఉన్న యూరియా వాడకం 40%  మేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 
బస్తా యూరియాకు...అరలీటరు డబ్బా చాలు
ప్రస్తుతం సాధారణ యూరియా 45 కిలోలు ఒక  బస్తాగా, సబ్సిడీ, ఇతర పన్నులతో కలిపి ఎమ్మార్పీ రూ.266 గా రైతులకు అమ్ముతున్నారు. ఇందులో 46 % నత్రజని ఉంటుంది. నానో యూరియాలోనూ నత్రజని ఇదే శాతం ఉంటుందని చెబుతున్నారు. దీని ధర రూ.240గా నిర్ణయించారు.  మొక్కలకు స్ర్పే చేయడం ద్వారా అది మొక్కలోకి చేరి ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుందంటున్నారు. అదే సాధారణ యూరియా అయితే పంటకు  వేసే దాంట్లో సగమే మొక్కకు చేరి మిగిలినది వృథాగా నేలలో, నీటిలో కలిసి కాలుష్యం పెరుగుతోందని, నానో యూరియాతో వేస్టేజ్‌‌ తగ్గించుకోవచ్చునని సైంటిస్టులు చెప్తున్నారు. అదే సమయంలో నీటి కాలుష్యంపై కొంత స్టడీ చేయాల్సి ఉంటుందన్నారు.
8 శాతం ఎక్కువ దిగుబడి
ట్రాన్స్పోర్ట్, స్టోరేజ్ విషయంలో నానో యూరియా ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. రైతులు ఆటోలు మాట్లాడుకుని యూరియా ట్రాన్స్​పోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, చేతిలోనే పట్టుకుని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దేశంలో 94 పంటలపై చేసిన 11 వేల ఫార్మర్‌‌‌‌ ఫీల్డ్‌‌ ట్రయల్స్‌‌లో 8 శాతం ఎక్కువ దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. ఆ తరువాత ఐకార్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఇతర రికమండేషన్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎఫ్సీఓ (ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్1985)లో చేర్చింది. ఈ–మార్కెటింగ్ ద్వారా కూడా రైతులకు ఆన్‌లైన్‌లో నానో యూరియా అందుబాటులో ఉంచాలని ఇఫ్కో భావిస్తోంది.
నానో యూరియాపై ఇప్పటికే స్టడీ పూర్తయింది. కేంద్రం కూడా ఓకే చెప్పింది. అధికారులతో, రైతులతో త్వరలో మీటింగ్ జరగనుంది. నానో యూరియా సక్సెస్ అయితే ఇప్పుడు వాడుతున్న యూరియా వాడకం చాలావరకు తగ్గుతుంది. ఇఫ్ కో కంపెనీ వాళ్లు ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకొస్తాం అని చెబుతున్నారు. ఎంత వినియోగంలోకి తీసుకురావాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం.  - రాములు, ఆగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్