ఎయిర్ టెల్, జియో కస్టమర్లకు షాక్ : రీఛార్జ్ ధరలు భారీగా పెంచటానికి రెడీగా ఉన్నారు..!

ఎయిర్ టెల్, జియో కస్టమర్లకు షాక్ : రీఛార్జ్ ధరలు భారీగా పెంచటానికి రెడీగా ఉన్నారు..!

Mobile Recharge Plans: భారత టెలికాం రంగంలో భారీ పోటీ కొనసాగుతోంది. మెుబైల్ సర్వీస్ ప్రొవైడర్లు ఇప్పటికే పలుమార్లు తమ రీఛార్జ్ ప్లాన్లను పెంచాయి. అయితే ఈ ఏడాది చివరి నాటికి మరోసారి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. యాక్టివ్ యూజర్ల సంఖ్య వరుసగా 5వ నెల కూడా పెరిగిన వేళ టెలికాం సంస్థలు దానిని ఆదాయంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. 

డిసెంబర్ నాటికి జియో, ఎయిర్ టెల్ సంస్థలు తమ ప్లాన్ టారిఫ్ రేట్లను 10 నుంచి 12 శాతం పెంచాలని చూస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం దేశంలో మెుబైల్ ఫోన్ల వినియోగదారులు భారీగా పెరిగిన క్రమంలో యూజర్లు ఖరీదైన ఛార్జీలను భరించగలరని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. దీని ప్రకారం గతంలో కంటే నెలవారీ ఇంటర్నెట్ ప్యాక్స్ వాడే వ్యక్తులు రీచార్జ్ కోసం రూ.30 నుంచి రూ.50 వరకు అదనంగా వెచ్చించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

గత ఏడాది ముఖేష్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ వివాహం తర్వాత టారిఫ్స్ పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మిగిలిన సంస్థలైన విఐ, ఎయిర్ టెల్ కూడా 10 శాతం నుంచి 23 శాతం వరకు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. ఈసారి కంపెనీ మిడ్ రేంజ్ నుంచి హై రేంజ్ ప్లాన్ యూజర్లను టార్గెట్ చేస్తూ పెంపులకు దిగొచ్చని తెలుస్తోంది. దీనివల్ల ఎక్కువ కస్టమర్లను కోల్పోకుండానే ఆదాయాన్ని పెంచుకోవాలని సదరు సంస్థలు చూస్తున్నాయి. ఎందుకంటే గత ఏడాది జూలైలో రేట్ల పెంపు సమయంలో ఘర్ వాపసీ అంటూ చాలా మంది యూజర్లు ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్ సంస్థ మెుబైల్ సేవలకు పోర్ట్ అయ్యారు. 

ప్రస్తుతం దేశంలో యువ యూజర్లు రావటం వారు ఎక్కువగా ఇంటర్నెట్ వాడకానికి అలవాటుపడటంతో కంపెనీలు తమ 5జీ సేవలను కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. 5జీ సేవలు ఎంత వేగంగా, మెరుగ్గా ఉంటాయనేదానిపై ఆధారపడి యూజర్లను పెంచుకోవటం, కోల్పోవటం కొనసాగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారీ అప్పుల్లో కూరుకుపోయిన వొడఫోన్ ఐడియా 5జీ సేవలను ఆలస్యం చేస్తున్న క్రమంలో దాని కస్టమర్లు జియో, ఎయిర్ టెల్ సంస్థలకు మైగ్రేట్ అవుతున్నారు. 

ALSO READ : ముంబై దాడుల్లో పాక్ ఆర్మీకి నేను అత్యంత నమ్మకమైన ఏజెంట్: ఒప్పుకున్న తహవ్వూర్ రాణా

2025-27 మధ్య కాలంలో టెలికాం సంస్థల ఆదాయాలు రెండంకెల వృద్ధిని నమోదు చేస్తాయని బీఎన్పీ పరిబాస్ తన రిపోర్టులో పేర్కొంది. అయితే ఈసారి రేట్ల పెంపులను దేశంలోని టెలికాం యూజర్లు ఎలా స్వీకరిస్తారనే విషయం మరిన్ని రోజులు వేచిచూస్తే కానీ తెలియని అంశంగా నిపుణులు చెబుతున్నారు.