చంద్రయాన్ 3 సక్సెస్.. నా జన్మ ధన్యమైంది: ప్రధాని మోదీ

చంద్రయాన్ 3 సక్సెస్.. నా జన్మ ధన్యమైంది: ప్రధాని మోదీ

జోహాన్నెస్ బర్గ్: అంతరిక్ష చరిత్రలో ఇస్రో హిస్టరీ సృష్టించిందని, ఈ క్షణం కోసమే ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూశానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రుడి సౌత్ పోల్​పై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచిందని తెలిపారు. మిషన్ సక్సెస్ వెనుక ఎంతో సైంటిస్టులు, ఇంజినీర్ల కృషి ఉందని, అందరికీ అభినందనలు చెబుతున్నట్లు ప్రకటించారు. 

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న మోదీ.. వర్చువల్​గా చంద్రయాన్ 3 ప్రయోగాన్ని చూశారు. మిషన్ సక్సెస్ అయ్యాక సైంటిస్టులను ఉద్దేశిస్తూ మాట్లాడారు.  చంద్రయాన్ 3 సక్సెస్​తో తన జీవితం ధన్యమైందని అన్నారు. ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది ప్రజలు ఎదురు చూశారని తెలిపారు. ‘‘ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు. 

బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా.. నా మనసంతా చంద్రయాన్ ‌‌‌‌‌పైనే ఉంది. ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం ఒక్క మన దేశానిది మాత్రమే కాదు.. మానవాళి అందరిదీ. ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు అనే నినాదం ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నది. భవిష్యత్తులో ఇతర దేశాలు చేపట్టే మూన్ మిషన్​లకు ఇది ఎంతో సహాయం చేస్తుంది” అని మోదీ అన్నారు. 

చందమామపై కొత్త సామెతలు వస్తాయ్

‘ఇండియాలో చంద్రుడిని చందమామ అని పిలుస్తుంటాం. చందమామ చాలా దూరంలో ఉన్నాడు అని ఒకప్పుడు మన పిల్లలకు చెప్పేవాళ్లం.. ఇప్పుడు చంద మామ ఒక టూర్ దూరంలో ఉన్నాడు అని చెప్పుకుందాం. కొత్త తరానికి కొత్త సామెతలు వస్తాయి” అని మోదీ తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలంలో దక్కిన తొలి ఘన విజయం అని వెల్లడించారు. 

‘‘ఈ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేము. ఇవి అద్భుతమైన క్షణాలు.. ఇది ఇండియా విజయ గర్జన.. సమస్యల మహాసముద్రాన్ని జయించిన క్షణం ఇది. చంద్రుడిపై విజయమనే అడుగులు పడిన క్షణాలివి. కొత్త విశ్వాసం.. చైతన్యంతో రాబోయే భవిష్యత్తుకు ఆహ్వానం పలుకుతున్న క్షణాలివి. మనం భూమిపై లక్ష్యాన్ని నిర్దేశించుకుని చంద్రుడిపై సాధించాం. మన సైంటిస్టులు చెప్పినట్టు ఇప్పుడు ఇండియా చంద్రుడిపై ఉంది. మనం అంతరిక్షంలో ఇండియా ప్రారంభించిన సరికొత్త ప్రయాణానికి సాక్ష్యంగా నిలిచాం” అని మోదీ అన్నారు.

ఆకాశమే హద్దు అని నిరూపించాం

ఈ విజయం ఇండియా పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్తుందని మోదీ అన్నారు. ఎన్నో అద్భుత అవకాశాలను సాకారం చేసుకుంటామని, ఇప్పటికే చాలా లక్ష్యాలు పెట్టుకున్నామని తెలిపారు. త్వరలోనే ఇస్రో ఆదిత్య ఎల్, గగన్ యాన్ మానవరహిత అంతరిక్ష ప్రయోగం కోసం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. విజయాలకు ఆకాశమే హద్దు అని ఇండియా పదే పదే నిరూపిస్తోందని కొనియాడారు.