రాష్ట్ర ప్ర‌భుత్వానికి నాట్కో ఫార్మా విరాళం

రాష్ట్ర ప్ర‌భుత్వానికి నాట్కో ఫార్మా విరాళం

హైద‌రాబాద్ : తెలంగాణ‌ రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు అవసరమైన మందుల సరఫరాను,  వాక్సీన్ సరఫరాకు సంబంధించిన అంశాలపై శుక్ర‌వారం  ప‌లు ఫార్మా కంపెనీల‌తో మంత్రి కేటీఆర్ చ‌ర్చించారు. కేటీఆర్ సార‌ధ్యంలొ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ..  వ్యాక్సిన్ తయారీదారులు,  ఫార్మా సంస్థలతో ప్రగతిభవన్లో సమావేశమైంది. కోవిడ్ సంబంధిత చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్న (రెమ్డేసివిర్ వంటి) మందులను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలతో విస్తృతంగా చర్చించింది టాస్క్ ఫోర్స్. ఆ మందుల ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తెలంగాణ ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఫార్మా కంపెనీల తో వివిధ అంశాలపై చర్చించిన అనంతరం వ్యాక్సిన్ తయారు చేస్తున్న పలు కంపెనీల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్ బృందం చర్చలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల యొక్క వాక్సిన్ స‌ర‌ఫ‌రా పెంపుదలకు ఉన్న అవకాశాలు, వాటికి సంబంధించిన గడువులు, వాక్సిన్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా విస్తరించేందుకు అవసరమైన చర్యల వంటి వివిధ అంశాలపైన కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్, బయోలాజికల్- ఈ  వంటి వ్యాక్సిన్ తయారీ సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రో- యాక్టివ్ గా వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

స‌మావేశం త‌ర్వాత తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వానికి నాట్కో ఫార్మా భారీ విరాళం ఇచ్చింది. క‌రోనా నియంత్ర‌ణ‌కు ఉప‌యోగించే బారిసిటినిబ్ మాత్ర‌ల‌ను విరాళంగా ఇచ్చింది. ఒక ల‌క్ష మంది క‌రోనా రోగుల‌కు ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఈ మాత్ర‌ల‌ను అందివ్వ‌నున్నారు. ఈ మాత్ర‌ల విలువ రూ. 4.2 కోట్లు. ఈ మేర‌కు సంబంధిత ప‌త్రాన్ని నాట్కో సీఈవో రాజీవ్ న‌న్న‌ప‌నేని మంత్రి కేటీఆర్‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నాట్కో సంస్థ‌కు మంత్రి కేటీఆర్ హృద‌య‌పూర్వ‌క‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.