జాతీయాదాయ లెక్కలు

జాతీయాదాయ లెక్కలు

బ్రిటిష్​ పాలనలో జాతీయాదాయాన్ని అంచనా వేయడానికి పెద్దగా కృషి జరగలేదు. కొంత మంది ఆర్థికవేత్తలు వ్యక్తిగత హోదాలో అంచనా వేశారు. మన దేశంలో మొదటిసారిగా దాదాబాయి నౌరోజి జాతీయాదా యం, తలసరి ఆదాయాల అంచనాలను 1867-68 సంవత్సరానికి సంబంధించి 1876లో గణించారు. అప్పటి తలసరి ఆదాయం 20 రూపాయలు, జాతీయాదాయం రూ.340కోట్లు, జనాభా 17 కోట్లు. 1921-22లో కె.టి.షా, కంబట్టాలు వెల్త్ అండ్​ ట్యాక్సెబుల్​ కెపాసిటీ ఇన్​ ఇండియా అనే గ్రంథంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం అంచనా వేశారు.

1931–40లో ఆర్.సి.దేశాయ్​ తన కన్స్యూమర్​ ఎక్స్పెండిచర్​ ఇన్​ ఇండియా 1931–32 నుంచి 1940–41 అనే పరిశోధనలో దేశంలోని కుటుంబాలు చేసే వ్యయాన్ని ఆధారంగా చేసుకుని జాతీయాదాయం లెక్కించారు. 

స్వాతంత్ర్యానంతరం

జాతీయాదాయ అంచనాల ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 1949లో పి.సి.మహల్​నోబిస్​ అధ్యక్షతన డి.ఆర్​.గాడ్గిల్​, వి.కె.ఆర్​.వి.రావులను సభ్యులుగా జాతీయాదాయ అంచనాల కమిటీని నియమించింది. దీన్నే హై పవర్డ్​ ఎక్సపర్ట్​ కమిటీ అంటారు. నాటికి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సైమన్​ కుజెనెట్స్​, స్టోన్​, డెర్క్​సన్​ల సలహాలను ఈ కమిటీ పొందింది. మొదటిసారిగా దేశం మొత్తానికి సంబంధించిన లెక్కలను చేపట్టడం వల్ల జాతీయాదాయ చరిత్రలో దీన్ని ల్యాండ్​మార్క్​గా పిలుస్తారు. 1951లో మొదటి నివేదిక, 1954లో తుది నివేదికను విడుదల చేసింది. మొదటి నివేదికలో 1948–49 ధరల్లో తలసరి ఆదాయం రూ.225, జాతీయాదాయం రూ.8710 కోట్లుగా అంచనా వేశారు. 

సీఎస్​ఓ అంచనాలు

సెంట్రల్​ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్​ను ప్రభుత్వం 1951లో స్థాపించింది. అప్పటివరకు ఉన్న జాతీయాదాయ అంచనాల విభాగాన్ని 1954లో సీఎస్​ఓకు అప్పగించారు. సీఎస్​ఓ జాతీయాదాయాన్ని ప్రస్తుత ధరల్లోను, ఆధార సంవత్సర ధరల్లోనూ లెక్కిస్తోంది. మన దేశంలో నేటివరకు తీసుకున్న ఆధార సంవత్సరాలు 1948–49, 1960–61, 1970–71, 1980–81, 1993–94, 1999–2000, 2004–05, 2011–12. 2015 జనవరి నుంచి 2011–12ను ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఈ కొత్త శ్రేణిలో ప్రణబ్​ సేన్​ కమిటీ సిఫారసులపై యూన్​ మార్గదర్శకాలపై కూడా చేర్చడమైంది. 

మదింపు పద్ధతులు

ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తుసేవలు ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి విలువ ఉత్పత్తి కారకాలకు ఆదాయాలుగా పంపిణీ అవుతుంది. ఈ ఆదాయం వినియోగ, పెట్టుబడి వస్తువులపై వ్యయం చేయబడును. వ్యయం తిరిగి ఉత్పత్తికి దోహదపడుతుంది. ఉత్పత్తి వల్ల ఆదాయం సృష్టించబడుతుంది. ఆదాయం వస్తు సేవలను డిమాండ్​ను కల్పిస్తుంది. డిమాండ్​ వల్ల వస్తు సేవలపై వ్యయం జరుగును. వ్యయం తిరిగి ఉత్పత్తికి దారితీయును. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయి. అందుకే జాతీయాదాయాన్ని మూడు పద్ధతుల్లో గణిస్తారు. అవి. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. 

ఉత్పత్తి మదింపు పద్ధతి : దీన్నే  ప్రొడక్ట్​ మెథడ్​, సెన్సెస్​ మెథడ్​, వాల్యూ యాడెడ్​ మెథడ్​, ఇండస్ట్రియల్​ ఆర్జిన్​ మెథడ్​, నెట్​ అవుట్​పుట్​ మెథడ్​ అని పిలుస్తారు. ఒక దేశంలోని వివిధ రంగాలు ఉత్పత్తి చేసిన మొత్తం వస్తుసేవల ద్రవ్య విలువను జాతీయాదాయంగా చెప్పవచ్చు.

ఆదాయ మదింపు పద్ధతి :  దీన్నే ఫ్యాక్టర్​ పేమెంట్​ మెథడ్​, డిస్ట్రిబ్యూటెడ్​ షేర్​ మెథడ్​, ఇన్​కం పెయిడ్​ మెథడ్​, ఇన్​కం రిసీవ్డ్ మెథడ్​ అని పిలుస్తారు. ఉత్పత్తికారకాలు (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) తమ సేవలు అందించడం ద్వారా ప్రతిఫలాలు (భాటకం, వేతనం, వడ్డీ, లాభాలు) పొందుతాయి. ఈ ప్రతిఫలాలను కలిపితే జాతీయాదాయం వస్తుంది.

వ్యయ మదింపు పద్ధతి :  దీన్నే ఇనకం  డిస్పోజల్​ మెథడ్​ అంటారు. ఆర్థిక వ్యవస్థలో జరిగే అంతిమ వ్యయం లెక్కించుట ద్వారా జీడీపీని పొందవచ్చు. అంతిమ వస్తువులపై చేసే అంతిమ వ్యయం ద్వారా దీన్ని గణిస్తారు. అంతిమ వస్తువులు అనేవి వినియోగానికి గాని, పెట్టుబడికి గాని కావచ్చు. అంటే అంతిమ వినియోగ వ్యయం, అంతిమ పెట్టుబడి వ్యయం కలుపుట ద్వారా దీన్ని పొందవచ్చు. 

దేశంలో అవలంబించే పద్ధతి

మన దేశంలో నమ్మదగిన దత్తాంశాలు లేకపోవడం వల్ల ఏ ఒక్క పద్ధతిని ఉపయోగించి సంపూర్ణంగా జాతీయాదాన్ని లెక్కించలేం. అందువల్ల మన దేశంలో వివిధ రంగాల్లో వివిధ పద్ధతులను అవలంబిస్తున్నారు. అందుకే మన దేశంలో అనుసరించే పద్ధతి మిశ్రమ పద్ధతి అంటాం.

వి.కె.ఆర్​.వి.రావు అంచనాలు 

స్వాతంత్ర్యానికి పూర్వం భారత జాతీయాదాయాన్ని ఒక క్రమ పద్ధతిలో అంచనా వేసిన ఘనత వి.కె.ఆర్​.వి.రావుకు దక్కుతుంది. 1925–29లో యాన్​ ఎస్సే ఆన్​ ఇండియాస్​ నేషనల్​ ఇన్​కం అనే వ్యాసం, 1931–32లో బ్రిటిష్​ ఇండియా జాతీయాదాయం అనే పుస్తకంలో జాతీయాదాయం గురించి తెలిపారు. వి.కె.ఆర్​.వి.రావు 1931–32 సంవత్సరానికి సంబంధించి జాతీయాదాయం 1689కోట్లుగాను, తలసరి ఆదాయం 62 రూపాయలుగా అంచనా వేశారు. వి.కె.ఆర్​.వి.రావు ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ రంగం, కార్పొరేషన్​ రంగం అనే రెండు విభాగాలు విభజించారు.

వ్యవసాయరంగంలో ఉత్పత్తి మదింపు పద్ధతిని, కార్పొరేషన్​ రంగంలో ఆదాయ మదింపు పద్ధతిని జాతీయాదాయం అంచనా వేయడానికి ఉపయోగించారు. ఈ రెండు రంగాలకు విదేశీ నికర కారక ఆదాయం కలిపితే జాతీయాదాయం వస్తుంది. వి.కె.ఆర్​.వి.రావు ఉపయోగించిన పద్ధతిని నేటికీ భారతదేశంలో అనుసరిస్తున్నారు.