అవిశ్వాసం ఆటలో నెగ్గేదెవరో?

అవిశ్వాసం ఆటలో నెగ్గేదెవరో?
  • నేడు భువనగిరి, నేరేడుచర్ల... రేపు హుజూర్​నగర్​
  • 27న ఆలేరు, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో...
  • క్యాంపులో భువనగిరి, నేరేడుచర్ల, ఆలేరు కౌన్సిలర్లు

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవిశ్వాసం ఆట ఊపందుకుంది. బీఆర్​ఎస్​ చైర్మన్లపై ఆ పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేసి అవిశ్వాసాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నల్గొండ చైర్మన్‌ దింపేయగా... కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. నందికొండ అవిశ్వాసంపై కోర్టు స్టే ఇచ్చింది.  మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో అవిశ్వాసం నిర్వహించనున్నారు. బుధవారం హుజూర్​నగర్, శనివారం ఆలేరు, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం మీటింగ్‌లు జరుగనున్నాయి. చైర్మన్లు పదవి నిలుపుకుంటారో..?  కుర్చీ దిగిపోతారో ఈ మీటింగుల్లో తేలనుంది. అయితే భువనగిరి చైర్మన్, వైస్​ చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేసినా.. ఇప్పటివరకూ ఆమోదించలేదు.   

ఉదయం 11 గంటలకు భువనగిరిలో మీటింగ్‌ 

యాదాద్రి జిల్లా భువనగిరి, సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో మంగళవారం అవిశ్వాసం మీటింగ్​ఉదయం 11 గంటలకు జరగనుంది. భువనగిరిలో 35 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాసంపై 16 మంది బీఆర్​ఎస్​ , 9 మంది కాంగ్రెస్​ ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేశారు. చైర్మన్​, వైస్​చైర్మన్​ ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య వెంట నలుగురు మాత్రమే ఉన్నారు. అవిశ్వాసం మీటింగ్​ జరగాలంటే  2019 మున్సిపాలిటీ చట్టం ప్రకారం 24 మంది  హాజరుకావాల్సి ఉంటుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు భువనగిరి ఆర్డీవో, ప్రిసైడింగ్​ ఆఫీసర్​ అమరేందర్​ మీటింగ్​ఏర్పాటు చేస్తారు. 24 మంది హాజరుకాని పక్షంలో రెండుమార్లు వాయిదా వేసి మెంబర్ల కోసం ఎదురు చూస్తారు. అయినా కౌన్సిలర్లు హాజరుకాని పక్షంలో అవిశ్వాసం మీటింగ్‌ను రద్దు చేస్తారు. 

నేరుడుచర్లలో...

నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల ముందు వైస్​ చైర్మన్​ చల్లా శ్రీలత బీఆర్​ఎస్​కు, కౌన్సిలర్​ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వీరిలో బీఆర్‌‌ఎస్‌కు చెందిన ఆరుగురు కౌన్సిలర్లలో ముగ్గురు కాంగ్రెస్‌లో చేరారు. చైర్మన్ చందమల్ల జయబాబుపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్, 10 కాంగ్రెస్, ఒక సీపీఎం కౌన్సిలర్ అవిశ్వాసంపై సంతకాలు చేశారు. ప్రిసైడింగ్​ ఆఫీసర్​గా వ్యవహరిస్తున్న ఆర్డీవో ఎన్​ జనార్దన్​రెడ్డి మంగళవారం ఉదయం మీటింగ్​ ప్రారంభిస్తారు. రూల్స్​ ప్రకారం మీటింగ్​కు 9 మంది హాజరుకావాలి. 

క్యాంపుల నుంచి మున్సిపాలిటీకే

భువనగిరి, నేరేడుచర్ల కౌన్సిలర్లు వేర్వేరు ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్నారు. హైదరాబాద్​లో ఉన్న అసమ్మతి బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు 16 మంది నేరుగా భువనగిరి మున్సిపాలిటీ ఆఫీసుకు చేరుకుంటామని వారికి నాయకత్వం వహిస్తున్న అజీమ్​ తెలిపారు. కాగా తనతో పాటు చైర్మన్​ సహా నలుగురం అవిశ్వాస మీటింగ్​కు హాజరుకాబోమని భువనగిరి వైస్​ చైర్మన్​ చింతల కిష్టయ్య స్పష్టం చేశారు.  బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం మీటింగ్​కు హాజరవుతామని ప్లోర్​ లీడర్​ మాయ దశరథ తెలిపారు. నేరేడుచర్ల కౌన్సిలర్లు కూడా మంగళవారం ఉదయం నేరుగా మున్సిపాలిటీకి వస్తారని తెలుస్తోంది.

రేపు హుజుర్ నగర్ లో... 

హుజర్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై బుధవారం అవిశ్వాసం పెడుతున్నారు. మున్సిపాలిటీ లో మొత్తం 28మంది కౌన్సిలర్లు ఉండగా 20 మంది బీఆర్ఎస్ నుంచి ఏడుగురు కాంగ్రెస్,  సీపీఎం నుంచి ఒక కౌన్సిలర్‌‌ గెలుపొందారు. వీరిలో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరారు. ఒకరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. వీరిలో 18మంది కౌన్సిలర్లు అవిశ్వాసంపై సంతకాలు చేసి కలెక్టర్ కు అందించారు. అయితే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విప్​జారీ చేశారు. 

నాలుగు రోజుల్లో మరో మూడు మున్సిపాలిటీల్లో..

ఆలేరు, సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో ఈ నెల 27న అవిశ్వాస సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆలేరు మున్సిపల్​ చైర్మన్​ వస్పరి శంకరయ్యపై ఇచ్చిన అవిశ్వాసంపై బీఆర్ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​, ఇండిపెండెంట్​ కౌన్సిలర్లు 8 మంది సంతకాలు చేశారు. శంకరయ్యవైపు నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం వారితో క్యాంపులో ఉన్న శంకరయ్య.. అవిశ్వాసం నోటీసుపై సంతకాలు చేసిన ఇద్దరితో  సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష పై అవిశ్వాసం పెట్టేందుకు కౌన్సిలర్లు కలెక్టర్ కు తీర్మానం కాపీ అందజేశారు.  

ఇక్కడ 35మంది కౌన్సిలర్లు ఉండగా 26 మంది కాంగ్రెస్ వైపే ఉన్నారు. అలాగే సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్‌‌పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. మొత్తం 48మంది కౌన్సిలర్లలో 32మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టర్‌‌కు అందజేశారు. మొత్తం 48 కౌన్సిలర్లలో 30 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, నలుగురు బీజేపీ, నలుగురు బీఎస్పీ కౌన్సిలర్లు ఉండగా.. 16మంది బీఆర్ఎస్,  8 మంది కాంగ్రెస్ , 8 మంది బీజేపీ, బీఎస్పీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేశారు. మరో 14మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి హైదరాబాద్ క్యాంప్​కు తరలించారు.