రేపటికి రేపు కేసీఆర్ మంత్రి వర్గాన్ని రద్దు చేసినా ఆశ్చర్యం లేదు

రేపటికి రేపు కేసీఆర్ మంత్రి వర్గాన్ని రద్దు చేసినా ఆశ్చర్యం లేదు
  • కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి, దోపిడీ జరిగింది
  • దోపిడీ కాళేశ్వరం కాదు విద్యనిచ్చే జ్ఞానేశ్వరం తెస్తాం
  • మల్లారెడ్డి యూనివర్శిటీలో ఆయన భాషే నేర్పిస్తారా?
  • ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుద్దాం
  • బీఎస్పీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

కరీంనగర్: ‘‘కేసీఆర్ పరిస్థితి చూస్తుంటే రేపటికి రేపు మంత్రివర్గాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ లో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఎస్పీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లోకి పోయింది ? ఎవరు సంపదను అనుభవిస్తున్నారనేది మనమంతా ప్రజలకు వివరించాలి. ప్రతి ఒక్కరూ మాయవతిలాగా, కాన్షిరాం లాగా పనిచేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలి. బీఎస్పీలో తిరుగుతే పథకాలు రావని బెదిరిస్తున్నారట. మీ బెదిరింపులు ఇక సాగవు. ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుద్దాం...’’ అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. 
మా మీటింగ్ కే పవర్ తీసేస్తే.. మేమొచ్చాక మీ ఫాంహౌస్ కూ కట్ చేస్తాం
మా మీటింగులకు కరెంట్ కట్ చేస్తున్నారు.. రేపు మేం అధికారంలోకి వచ్చాక మీ ఫామ్ హౌస్ కు కరెంట్ చేస్తామని మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. ఒకప్పుడు కల్లోల జిల్లా కరీంగనర్ కోటి కాంతుల ఖిల్లా. ఇతర పార్టీల కండువాలను చెత్తకుప్పలో పడేసి బీఎస్పీ కండువా వేసుకున్న సోదరులకు స్వాగతం. ఎన్ని అవమానాలు, అడ్డంకులు, బెదరింపులు వచ్చినా లొంగకుండా బీఎస్పీ కోసం పనిచేస్తున్న వారికి ధన్యవాదాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహుజన సమాజ్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చ  75 సంవత్సరాలైనా.. ఇంకా భూమిలేని నిరుపేద కూలీలున్నారు. ఇన్నేళ్లకు కూలీలు ట్రాక్టర్లకు ఓనర్లవుతున్నారని హరీశ్ రావు చెబుతున్నాడంటే.. హుజురాబాద్ లో గెలిచేందుకే కదా. మా మీద ప్రేమ ఓట్ల కోసమే పుట్టుకువచ్చింది..ఏడేళ్ల మీ పాలనలో ఎస్సీ కార్పోరేషన్ కింద మంజూరు చేసిన నిధులెన్ని? వంద రూపాయలు ఇచ్చినట్లు పేపర్లపై చూపించి.. 30 రూపాయలు కూడా విడుదల చేయలేదు..’’ అన్నారు.
మౌనంగా ఉన్నందుకే తరతరాల అసైన్డ్ భూములు లాక్కున్నారు 
3 ఎకరాల భూమి ఇస్తామని కొందరికే ఇచ్చి తరతరాలుగా మేము అనుభవిస్తున్న అస్సైన్డ్ భూములు లాక్కున్నారని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తరతరాలుగా మనం మూగజీవులుగా ఉన్నందుకే మన అస్సైన్డ్ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటోందని ఆయన విమర్శించారు. వివిధ యూనివర్శిటీల్లో చదువుతున్న బహుజనుల బిడ్డలు చదువుకుంటుంటే.. వాళ్లకు నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన వనరులు కల్పించడం లేదు. 
యూనివర్శీటీలను బాగు చేయకుండా... మీరు ప్రయివేటు యూనివర్శిటీలకు అనుమతి ఇచ్చారు, ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేల్లారా.. ప్రయివేటు యూనివర్శిటీల్లో కూడా బహుజన బిడ్డలకు రిజర్వేషన్లు కావాలని ఎందుకు అడగలేదు? అని ఆయన ప్రశ్నించారు. 
గౌరవ స్థానంలో ఉండే మంత్రి తొడగొట్టి మాట్లాడుతారా?  మల్లారెడ్డిని బహిష్కరించాలి
ప్రతిపక్షంలో ఉండే రేవంత్ రెడ్డి గురించి.. మంత్రి మల్లారెడ్డి వాడే భాష ఏంటండి. నోటితో చెప్పలేనంత భాషను మీడియా సాక్షిగా మాట్లాడుతున్న మల్లారెడ్డి.. తన డీమ్డ్ యూనివర్శిటీలో ఇదే భాష నేర్పుతారా ? దళిత ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలు.. మల్లారెడ్డిని బహిష్కరించాలని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మీకు ఈ దుర్గార్మమైన భాష ఎవరు నేర్పించారు? ఎవరి ధైర్యంతో ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు? అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ భాష కూడా సరిగ్గా లేదు, ఆయనను దూషించిన నేత భాష కూడా సరిగ్గా లేదన్నారు.  
మల్లారెడ్డి యూనివర్శిటీలో ఆయన భాషే నేర్పిస్తారా?
బూతులు మాట్లాడేవాళ్లకు యూనివర్శిటీలు మంజూరు చేస్తున్నారని మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హుజురాబాద్ ఎన్నికలో అధికార పార్టీ ఓడినా, గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి ఒరిగేదేమీలేదు, పోయేదేమీ లేదన్నారు. వేల కోట్లు హుజురాబాద్ లో కుమ్మరించి ఈటలను ఓడించి..ఎవరికి పాఠం చెప్పాలనుకుంటున్నారు?  ఈ డబ్బులన్నీ ఎవరివి ? మా బిడ్డలు చెల్లించిన డబ్బులవి, మీ పార్టీలో ఎవరైనా తోక  జాడిస్తే వారిని బెదిరించడానికి ఇవన్నీ చేస్తున్నారా? అని ఆయన నిలదీశారు. రేపటి రేపు మంత్రి వర్గాన్ని కేసీఆర్ రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీఎం చేసిన అవినీతిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  
దుబ్బాకలో లాగే హుజురాబాద్ లో కూడా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయి
దుబ్బాకలో లాగే హుజూరాబాద్ లో రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని హుజురాబాద్ నియోజకవర్గంలోని సిరిసేడులో నిరుద్యోగి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు, నిరుద్యోగులు అధైర్య పడవద్దు. బహుజన రాజ్యంలో భవిష్యత్తు మీదే అని ఆయన హామీ ఇచ్చారు. 2018లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ముడేళ్లుగా ఏ జిల్లా ఏ జోన్ లోకి వెళ్లాలో తేల్చలేరా?  మళ్లీ ఎన్నికలొచ్చేదాకా ఇలాంటి కాలయాపనే చేస్తారా? 2022 దాకా నోటిఫికేషన్ వస్తుందన్న నమ్మకం లేదన్నారు. సిద్ధిపేట దాటాక కేసీఆర్ నగర్ అని పేరుంటుంది. కానీ ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఒక్కరూ కూడా లేరు. ఎంతో మంది దళితులు, నిరుపేదలు సొంతిళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలు తీర్చేందుకే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. మాయవతి ప్రధానమంత్రి కావాలి అన్నారు.
ఎస్సీల్లో అధికారులున్నారని సీఎంకు ఇప్పుడే గుర్తొచ్చిందా?
ఎస్సీల్లో అధికారులున్నారని కేసీఆర్ కు ఇప్పుడే గుర్తొచ్చిందా..? అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. రాహుల్ బొజ్జాను దళిత అధికారి అని ఎందుకు ప్రస్తావిస్తున్నారు ? ఏడేళ్ల తర్వాత ఎస్సీల్లో కూడా అధికారులు ఉంటారని సీఎంకు ఇప్పుడు గుర్తుకు వచ్చారు. రాహుల్ బొజ్జా దళిత అధికారి కాదు.. ఆయన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని ఆయన పేర్కొన్నారు. 
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల దోపిడీ జరిగింది..దోపిడీ కాళేశ్వరం కాదు విద్యనిచ్చే జ్ఞానేశ్వరం తెస్తాం
కాళేశ్వరం ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల సమస్యలు తీరలేదు. కోటి ఎకరాల సాగులోకి వస్తాయన్నారు. కానీ భూములు కోల్పోయిన వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం బడా కాంట్రాక్టర్లకే లాభం జరిగింది. వేల కోట్ల రూపాయల అవినీతి, దోపిడి జరిగిందని మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మేమైతే ఈ డబ్బులన్నీ జ్ఞానేశ్వరం పేరుతో యూనివర్శిటీలు, విద్యాసంస్థలు పెట్టి మా పిల్లలకు జ్ఞానం ఇచ్చేవాళ్లం అన్నారు. బహుజన రాజ్యం వచ్చాక కల్లుగీత కార్మికుల కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజినీర్లను తయారు చేస్తాం. అవినీతి పాలవుతున్న సొమ్మునంతా చదువుల కోసం ఖర్చు చేసి.. ప్రపంచంలోనే అత్యున్నత అవకాశాలు పొందేలా యువతను తీర్చిదిద్దుతా అన్నారు.  ’’మన గురించి రాసేందుకు పత్రికలు, టీవీలు సిద్ధంగా లేవు. నమస్తే తెలంగాణలో మన నల్గొండ సభ గురించి ఒక్క లైన్ కూడా రాలేదు. అలాంటి పత్రికకు వేల కోట్ల ప్రజల సొమ్మను ఐ అండ్ పీఆర్ నుంచి యాడ్స్ ఎలా ఇస్తున్నారు. పత్రికలను మనం నమ్ముకోవడం కాదు.. మనమే ఒక్కొక్కరు ఒక్కో యూ ట్యూబ్ కావాలి.  సోషల్ మీడియాను బాగా ఉపయోగించి బహుజన వాదాన్ని గ్రామాలకు తీసుకెళ్లాలి..’’ అని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రగతి భవన్ ను మనం బహుజన భవన్ గా మారుద్దాం, అలాంటి గొప్ప కలను మన బిడ్డలకు చెప్పాలన్నారు. 
కారు కింద పడతారా? ఏనుగెక్కి పోతారా? తేల్చుకోండి
బహుజన రాజ్యాధికారం సులభమైన పని కాదు. అవతలి టీం దగ్గర వేల కోట్ల రూపాయలున్నాయి. హుజురాబాద్ లోనే అధికారికంగా వేల కోట్లు పంచుతున్నారు. భవిష్యత్తులో మన ఆత్మగౌరవాన్ని కొనుక్కునేలా ప్రలోభాలు పెడతారు. ఏనుగు గుర్తుకే ఓటేస్తామని మీరంతా మీ కుటుంబసభ్యులతో, బంధువులతో ప్రమాణం చేయించాలి. ప్రతి ఇంటి గోడపై ఏనుగు గుర్తు గీయించుకోవాలి. కారు కింద పడుతారా? ఏనుగు ఎక్కిపోతారా? తేల్చుకోవాలి..’’ అని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు.