లెటర్ టు ఎడిటర్ హాస్టళ్ల వెతలు!

లెటర్ టు ఎడిటర్ హాస్టళ్ల వెతలు!

రాష్ట్ర ప్రభుత్వం బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల కమిటీ చేసిన ప్రతిపాదనలలో కేవలం మెనూ చార్జీలు పెంచడం మాత్రమే కాదు,  గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా డైట్ చార్జీలు సంక్షేమ వసతి గృహాలకు చెల్లించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం అమలు కావడంలేదు. ప్రతినెల డైట్ చార్జీలు చెల్లించకుండా, విద్యార్థులకు పెంచిన డైట్ చార్జీలతో డైట్ అందించడం సాధ్యపడదు. 

గతం కంటే నేడు పెరిగిన చార్జీలతో విద్యార్థులకు డైట్ అందిస్తున్న కారణంగా సంక్షేమ వసతి గృహాధికారులకూ డైట్ చార్జీలు సకాలంలో చెల్లించకపోవడంతో అదనపు భారంగా మారింది. ఫైనాన్షియెర్స్ ల దగ్గర వడ్డీలు, ఇఎమ్ఐలతో పర్సనల్  లోన్లు తెచ్చి విద్యార్థులకు సంక్షేమ వసతి గృహాల్లో  రెగ్యులర్ మెనూ ప్రకారం భోజనం అందించాల్సిన పరిస్థితి ఉంది. 

రాష్ట్రంలో సుమారు 2300 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు, 400కు పైగా గురుకులాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ప్రైవేటు బిల్డింగ్ ఓనర్లకు కిరాయిలు చెల్లించకపోగా బిల్డింగులకు తాళాలు వేసిన సందర్భాలు లేకపోలేదు.   కనీసం కరెంట్ బిల్లులు చెల్లించకపోయినా డిస్కంలు నిరంతరాయంగా పవర్ సప్లై చేస్తున్నాయి. 

సంక్షేమ వసతి గృహాలకు, గురుకులాలకు నిత్యవసర వస్తువులు కూరగాయలు, పాలు, కోడిగుడ్లు, చికెన్, అరటిపండ్లు అందించే టెండరుదారులు  బిల్లుల సమస్య ఉందంటున్నారు, కొన్నిచోట్ల 15 రోజులకు సరిపడా ఒకేసారి కూరగాయలు వేస్తే మురిగిపోతున్న సందర్భాలు ఉన్నాయి. 

కేజీబీవీలలో చదువుకునే విద్యార్థులు ఇతర గురుకులాలు,  ఆశ్రమ పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయుల కొరత,  మౌలిక సదుపాయాలు, నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు తమకు కల్పిస్తున్న సదుపాయాలు చాలా పరిమితమైనవి, అక్కడ పనిచేసే ఉద్యోగులు తమని పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవిత భీమా, ఆరోగ్య భీమా తమకు వర్తింపజేయాలని ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వం కేజీబీవీల పట్ల  ప్రభుత్వం దృష్టిపెట్టాలి.

- బి. వీరభద్రం