ఎంపీ బండా ప్రకాశ్‌‌‌‌పై  కేసు నమోదు

ఎంపీ బండా ప్రకాశ్‌‌‌‌పై  కేసు నమోదు

వరంగల్​ క్రైం, వెలుగు: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ తో పాటు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లపై పోలీస్ కేసు నమోదైంది. అల్లూరి ట్రస్ట్ ఇన్ కం ట్యాక్స్ కు సంబంధించి రెండేండ్ల కిందట నిధుల దుర్వినియోగం చేశారంటూ ట్రస్ట్ సభ్యుడొకరు కోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు వరంగల్ లోని సుబేదారీ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 23న కేసు నమోదు కాగా, విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. హన్మకొండ న్యూశాయంపేటలోని అల్లూరి ట్రస్ట్, అల్లూరి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ సైన్సెస్ కార్యదర్శిగా, ట్రస్టీగా బండా ప్రకాశ్ ఉన్నారు. 2016–-17, 2017-–18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఎంపీ రూ.12.21 లక్షల మేరకు నిధుల దుర్వినియోగం చేశారని, ఇందుకు వరంగల్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్లు అత్తలూరి సత్యనారాయణ, అత్తలూరి వంశీధర్ సహకరించారని ఆరోపిస్తూ ట్రస్ట్ సభ్యుడు జె.భాస్కర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ముగ్గురిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.