మంత్రి వ్యాఖ్యలు..రాష్ట్రపతికి క్షమాపణ చెప్పిన దీదీ

మంత్రి  వ్యాఖ్యలు..రాష్ట్రపతికి క్షమాపణ చెప్పిన దీదీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమబెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలపై.. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేబినెట్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యల కారణంగా.. తమ పార్టీ తరపున రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదన్న దీదీ.. ఆ మంత్రికి హెచ్చరికలు జారీ చేశారు.రాష్ట్రపతి పై తమకు ఎంతో గౌరవం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అలాంటి వ్యక్తిపై కామెంట్లు చేసి మంత్రి తప్పు చేశారని.. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ రాష్ట్రపతికి క్షమాపణలు చెబుతున్నట్టు స్పష్టం చేశారు.

మరోవైపు, రాష్ట్రపతి పట్ల మంత్రి అఖిల్‌ గిరి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యల్ని  నిరసిస్తూ బెంగాల్‌ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత సువేందు అధికారి సారథ్యంలో రాజ్‌భవన్‌ వరకు మార్చ్‌ నిర్వహించారు. 

నందిగ్రామ్‌లో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో మంత్రి అఖిల్‌ మాట్లాడుతూ ‘‘నేను అందంగా లేనని బీజేపీ వారు అంటున్నారు, మేం ఎవరినీ వారి రూపం బట్టి అంచనా వేయం. రాష్ట్రపతి పదవిని గౌరవిస్తాం. కానీ మన రాష్ట్రపతి చూడటానికి ఎలా ఉంటారు?’’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రికి కేబినెట్ నుంచి తప్పించి.. మమత సర్కార్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ.. ‘‘రాష్ట్రపతిని అవమానించాలని నా ఉద్దేశం కాదు. బీజేపీ నేతలు నాపై చేసిన మాటల దాడికి బదులిచ్చాను. రోజు నా రూపంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లు ఎవరైనా భావిస్తే అది తప్పు. నాకు రాష్ట్రపతిపై అపారమైన గౌరవం ఉంది’’ అని చెప్పుకొచ్చారు. తర్వాత క్షమాపణ చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. బెంగాల్‌ మంత్రి వ్యాఖ్యలపై ద్రౌపదీ ముర్ముకు మద్దతుగా... వివిధ ప్రాంతాల్లో అఖిల్‌ గిరికి వ్యతిరేకంగా ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి.