వానలు పడుతున్నా చెరువులు నిండట్లే!

వానలు పడుతున్నా చెరువులు నిండట్లే!
  • 21,500 చెరువుల్లో నిండినవి 7,500 
  • 5,795 చెరువుల్లోకిచుక్క నీరు కూడా రాలే
  • సిద్దిపేట, మెదక్​ జిల్లాల్లోపరిస్థితి దారుణం
  • కృష్ణా ప్రాజెక్టులకు మళ్లీ మొదలైన వరద

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చెరువులు బోసిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నా చెరువులు మాత్రం నిండడం లేదు. రాష్ట్రంలో మొత్తం 21,500 చెరువులు ఉండగా.. అందులో ఇప్పటివరకు నిండింది 34.5 శాతం చెరువులే. అంటే 7500 చెరువులు మాత్రమే ప్రస్తుతం నిండుకుండలా ఉన్నాయి. మిగతా 14 వేల చెరువుల్లో వరదల్లేక నిండడం లేదు. మొత్తంగా చెరువుల కెపాసిటీ 253.8 టీఎంసీలుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని చెరువుల్లో కలిపి ప్రస్తుతం కేవలం 87.25 టీఎంసీల నీటి నిల్వలే ఉన్నాయి.

 సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో లోటు ఎక్కువగా కనిపిస్తున్నది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సర్యాపేట, జయశంకర్​ భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్​ జిల్లాల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నది. ఆయా జిల్లాల్లో 40 శాతానికిపైగా చెరువులు నిండాయి. ఆదిలాబాద్​, నిర్మల్​, కామారెడ్డి, నిజామాబాద్​ జిల్లాల్లోనూ పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని డేటా స్పష్టం చేస్తున్నది.

ఇన్ని చెరువుల్లోకి నీళ్లు రాలే..

5,795 చెరువుల్లోకి ఇప్పటివరకు చుక్క వరద కూడా వచ్చి చేరలేదు. మొత్తం చెరువుల్లో 75 శాతం నుంచి 100 శాతం నిండిన చెరువులు కేవలం 893 కావడం గమనార్హం. 50 శాతం నుంచి 75 శాతం నిండినవి 2,828, 25 శాతం నుంచి 50 శాతం నిండినవి 4,088 చెరువులు, 0 నుంచి 25 శాతం వరకు నిండిన చెరువులు 7,896 వరకు ఉన్నాయి. జగిత్యాలలో 360 చెరువులు, జనగామలో 22, జోగుళాంబ గద్వాలలో 14, కామారెడ్డిలో 42, కరీంనగర్​లో 256, కుమ్రంభీం ఆసిఫాబాద్​లో 65, మహబూబ్​నగర్​లో 27, మంచిర్యాలలో 272, మేడ్చల్​ మల్కాజ్​గిరిలో 14, ములుగులో 57, నాగర్​కర్నూలులో 90, నారాయణపేటలో 9, నిజామాబాద్​లో 210, పెద్దపల్లిలో 338, రాజన్న సిరిసిల్లలో 168, రంగారెడ్డిలో 37, సంగారెడ్డిలో 53, వికారాబాద్​లో 39, వనపర్తిలో 17, వరంగల్​లో 152, యాదాద్రి భువనగిరిలో 621 చెరువుల్లోకి ఇప్పటిదాకా వరద వచ్చి చేరలేదు. 

ప్రాజెక్టులకు మళ్లీ మొదలైన వరద

రాష్ట్రంలోని కృష్ణా బేసిన్​కు మళ్లీ వరద మొదలైంది. జూరాల ప్రాజెక్టుకు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా దిగువకు 85,989 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇటు జూరాలతో పాటు సుంకేశుల, తుంగభద్ర నుంచి కూడా వరద పోటెత్తుతుండడంతో ప్రాజెక్టుకు దాదాపు 2 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లోస్​ వస్తున్నాయి. దిగువకు 1,01,679 క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జునసాగర్​కు రియలైజ్డ్ ఇన్​ఫ్లో 65,842 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1,09,953 క్యూసెక్కులను స్పిల్​ వే ద్వారా విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి బేసిన్​లో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుకు 35 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. సింగూరుకు 3,133 క్యూసెక్కులు, నిజాంసాగర్​కు 5,393 క్యూసెక్కుల వరద వస్తున్నది.