స్టేషన్ల విభజనకు జరిగేనా.. గ్రేటర్ లో సమస్యాత్మకంగా సుబేదారి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లు

స్టేషన్ల విభజనకు జరిగేనా.. గ్రేటర్ లో సమస్యాత్మకంగా సుబేదారి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లు
  • తరచూ ఆందోళనలు, గొడవలు, ఇతర నేరాలతో సిబ్బందిపై భారం
  • స్టేషన్ల విభజనకు గతంలోనే ప్రపోజల్స్
  • ఏండ్లు గడుస్తున్నా కొత్త స్టేషన్లకు కలగని మోక్షం
  • కమిషనరేట్ లో ట్రాఫిక్ ఠాణాలదీ అదే పరిస్థితి

హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో కొన్ని పోలీస్ స్టేషన్లు ఒత్తిడిలో మగ్గుతున్నాయి. నిత్యం క్రైమ్, నిరసనలు, ఆందోళనలు, గొడవలతో ఆయా స్టేషన్లు ఎప్పుడూ గరంగరంగానే ఉంటుండగా, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణకు అక్కడి పోలీస్ ఆఫీసర్లు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. పరిధి ఎక్కువగా ఉండటం, స్టేషన్ల విభజన ప్రపోజల్స్ కే పరిమితం కావడం వల్ల సిబ్బందిపై తీవ్ర భారం పడుతోంది. కొత్త స్టేషన్లు ఏర్పాటైతే సమస్య తీరనున్నప్పటికీ ఏండ్ల తరబడి ఆ ప్రక్రియ మాటలకే పరిమితమవుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో కొన్ని స్టేషన్ల సిబ్బంది ఒత్తిడిలోనే విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.

ఇటు సుబేదారి, అటు మిల్స్ కాలనీ..

వరంగల్ నగరంలో మొత్తం 10 పీఎస్ లు ఉండగా, అందులో సుబేదారి, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లపైనే ఎక్కువ భారం పడుతోంది. హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పరిషత్​ ఆఫీస్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్, ఎన్పీడీసీఎల్, ఇతర ప్రభుత్వ ఆఫీసులు సుబేదారి స్టేషన్ పరిధిలోనే ఉండగా, వివిధ ప్రజా సమస్యలపై నిత్యం ఏదో ఒక ఆందోళనో, నిరసనో జరుగుతుంటుంది. ఏకశిలా పార్కు, అంబేద్కర్ జంక్షన్, అదాలత్ జంక్షన్ వద్ద ధర్నాలతో పాటు పీఎస్ పరిధిలోని హాస్పిటళ్ల వద్ద తరచూ ఏదోఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. వీటికి తోడు దాడులు, దౌర్జన్యాలు, దొంగతనాలు, ఇతర నేరాలు కూడా జరుగుతుండటంతో ప్రతి నెలా ఈ స్టేషన్ లో 60కిపైగా ఎఫ్ఐఆర్ లు నమోదవుతున్నాయి. 

ఇలా గతేడు 763కిపైగా ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 566 దాటాయి. వీటితో పాటు తరచూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల పర్యటనలు కూడా ఈ స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా ఉంటుండగా, సుబేదారి పోలీస్ సీఐ, ఎస్సైలతో పాటు మిగతా సిబ్బందిపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. వరంగల్ మిల్స్ కాలనీ పీఎస్ పరిస్థితి మరోలా ఉంది.

ఈ స్టేషన్ పరిధిలో లేబర్ ఏరియాలు ఎక్కువగా ఉండగా, రౌడీ మూకలు, గంజాయి గ్యాంగులతో తరచూ గొడవలు జరుగుతుంటాయి. భూకబ్జాలు, ఇతర నేరాలతో ఏటా కమిషనరేట్ లోనే అత్యధికంగా మిల్స్ కాలనీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. నిరుడు మొత్తం 814 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 551 ఫైల్ అయ్యాయి. ఇలా ఇక్కడి పోలీస్ ఆఫీసర్లపైనా భారం తీవ్రంగా ఉంటోంది.

కొత్త స్టేషన్లు మాటలకే పరిమితం..

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం 45 లా అండ్ ఆర్డర్, మూడు ట్రాఫిక్, ఒక సీసీఎస్, సైబర్ క్రైమ్ స్టేషన్లతోపాటు రెండు విమెన్ పీఎస్ లు ఉన్నాయి. కమిషనరేట్ లో పెరుగుతున్న నేరాలు, జనాభా, ట్రాఫిక్ ను పరిగణనలోకి తీసుకుని గతంలో స్టేషన్ల విభజనతోపాటు కొత్త పీఎస్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ఇందులో ప్రధానంగా సుబేదారి స్టేషన్ ను విభజించి వడ్డేపల్లి, న్యూశాయంపేటలో కొత్త స్టేషన్లకు ప్రపోజల్స్ పెట్టారు. మిల్స్ కాలనీ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీలో మరో పీఎస్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపారు. కానీ, ఏండ్లు గడుస్తున్నా కొత్త స్టేషన్లకు మోక్షం కలగడం లేదు.

ట్రాఫిక్​ స్టేషన్లదీ అదే పరిస్థితి..

కమిషనరేట్ లో ట్రాఫిక్ కంట్రోల్ కోసం వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పీఎస్ లు ఉన్నాయి. కానీ, ఏటికేడు జనాభాతో పాటు వాహనాల సంఖ్య కూడా పెరుగుతుండగా,  ట్రాఫిక్​ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ట్రాఫిక్ పీఎస్ ల అవసరం ఏర్పడింది. దీంతోనే గతంలో జనగామ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, ఆత్మకూరు, కేయూ పరిధిలో ట్రాఫిక్ పీఎస్ లు ఏర్పాటు చేయాల్సిందిగా ప్రతిపాదించారు. కానీ వాటి ఏర్పాటుకు ఇంతవరకు మోక్షం కలగలేదు. 

ఇదిలాఉంటే దాదాపు నాలుగేండ్ల కేయూ, జనగామలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్పటి ఆఫీసర్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో అవి అమలులోకి రాక ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. ఇప్పటికైనా పరిధి ఎక్కువై సిబ్బందిపై భారం పడుతున్న స్టేషన్లను విభజించి, కొత్త పీఎస్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.