జమ్మూలోకి పాక్ డ్రోన్!

జమ్మూలోకి పాక్ డ్రోన్!
  • జారవిడిచిన ఆయుధాలు స్వాధీనం

జమ్మూ: పాకిస్తాన్ నుంచి వచ్చిన ఓ డ్రోన్ జమ్మూకాశ్మీర్ లో ఆయుధాలు జారవిడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఇంటర్నేషనల్ బార్డర్ కు 6 కిలోమీటర్ల దూరంలోని సౌంజానా గ్రామంలో డ్రోన్ వదిలి వెళ్లిన ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏకే 47 రైఫిల్, మూడు మ్యాగజైన్లు, 30 రౌండ్ల బుల్లెట్లు, టెలీస్కోప్ ఉన్నాయని పోలీసులు ఆదివారం వెల్లడించారు. శనివారం రాత్రి సౌండ్ రావడంతో బయటకు వచ్చి చూసిన ఓ వ్యక్తి...  పాక్ సైడ్ నుంచి వచ్చిన డ్రోన్ ఏదో ప్యాకెట్ ను జారవిడిచి వెళ్లినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు వెంటనే తనిఖీలు చేపట్టి, పసుపు రంగు ప్యాకెట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని, ఆ ఆయుధాలు ఎవరి కోసం వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కాగా, ఏడాదిగా పాక్ డ్రోన్ యాక్టివిటీలు పెరిగాయి. ఇది సెక్యూరిటీ ఫోర్సెస్​కు చాలెంజ్​గా మారింది. 
సీఆర్పీఎఫ్ బంకర్ పై గ్రెనేడ్ దాడి... 
శ్రీనగర్​లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడ్డారు.శనివారం మూడుచోట్ల అటాక్ చేశారు. మొదట కరణ్ నగర్​లో మాజిద్ అహ్మద్ గోజ్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తర్వాత అనంతనాగ్​లోని సీఆర్పీఎఫ్​40వ బెటాలియన్ బంకర్ టార్గెట్​గా గ్రెనేడ్ దాడి చేశారు. అయితే టార్గెట్ మిస్ కావడంతో ప్రమాదం తప్పింది. అది బంకర్​కు దగ్గర్లో పేలిందని, ఎవరికేం కాలేదని పోలీసులు చెప్పారు. ఇక మూడో అటాక్ లో బాటమాలూలో మహమ్మద్ షఫీదార్ అనే వ్యక్తిపై కాల్పులు జరపగా.. ఆయన ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయాడని పోలీసులు చెప్పారు.