అశ్రునయనాలతో ఆప్తుల చెంతకు .. హమాస్ చెర నుంచి రెండ్రోజుల్లో 41 మంది విడుదల

అశ్రునయనాలతో ఆప్తుల చెంతకు ..  హమాస్ చెర నుంచి రెండ్రోజుల్లో 41 మంది విడుదల

గాజా/జెరూసలెం:  నెల రోజులకుపైగా హమాస్ మిలిటెంట్ల చెరలో నరకం అనుభవించిన బందీలు కంటతడి పెడుతూ విషాద వదనాలతో తిరిగి సొంత కుటుంబసభ్యులు, బంధువుల చెంతకు చేరుకుంటున్నారు. మిలిటెంట్ల చెర నుంచి విడుదల అవుతున్నా వారి మొఖాల్లో మాత్రం విషాదం తాండవం చేస్తోంది. బందీల్లో దాదాపు అందరూ తమ కుటుంబసభ్యుల్లో ఒకరు లేదా ఇద్దరు ముగ్గురిని కోల్పోయారు. మరికొందరి కుటుంబంలో ఒకరో, ఇద్దరో ఇంకా మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు.  

మరోవైపు ఇజ్రాయెల్ విడుదల చేసిన పాలస్తీనియన్ ఖైదీలకు వెస్ట్ బ్యాంక్​లో ఘన స్వాగతం లభిస్తోంది. హమాస్​ అనుకూల నినాదాలతో జనం వారికి గ్రాండ్ వెల్ కం చెప్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం శుక్రవారం నుంచి అమలులోకి రాగా, మొదటి రోజున హమాస్13 మంది ఇజ్రాయెల్ పౌరులను విడిచిపెట్టింది. సెపరేట్ డీల్​లో భాగంగా10 మంది థాయిలాండ్ పౌరులు, ఒక ఫిలిప్పీన్స్ జాతీయుడిని కూడా రిలీజ్ చేసింది. 

బదులుగా ఇజ్రాయెల్ 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడుదల చేసింది. రెండోరోజు శనివారం నార్త్ గాజాకు సరుకుల ట్రక్కులు తగినన్ని రాలేదంటూ బందీల విడుదలకు మిలిటెంట్లు వ్యతిరేకించారు. దీంతో అర్ధరాత్రి వరకూ హైడ్రామా నడిచింది. గాజాలోకి ట్రక్కులు ఎంటరైన తర్వాత వాటి నిర్వహణ యూఎన్ ఆధ్వర్యంలో జరుగుతుందని, తమకు సంబంధంలేదని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. చివరకు అర్ధరాత్రి సమయంలో మరో 13 మంది ఇజ్రాయెల్ పౌరులను, నలుగురు థాయిలాండ్ దేశస్తులను మిలిటెంట్లు వదిలిపెట్టారు. 

బదులుగా ఇజ్రాయెల్ మరో 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను రిలీజ్ చేసింది. బందీలను రెడ్ క్రాస్ అంబులెన్స్ లలో రఫా క్రాసింగ్  గుండా ఈజిప్టులోకి తీసుకొచ్చి మిలిటెంట్లు వదిలేయగా.. పాలస్తీనియన్ ఖైదీలను కూడా రెడ్ క్రాస్ అంబులెన్స్ లలో వెస్ట్ బ్యాంక్ లోకి తీసుకెళ్లి ఇజ్రాయెల్ విడిచిపెట్టింది.  

హమాస్ టాప్ కమాండర్ మృతి 

ఇజ్రాయెల్ దాడుల్లో నార్త్ గాజాలోని హమాస్ టాప్ కమాండర్ అహ్మద్ అల్ ఘండౌర్ మరణించాడని మిలిటెంట్ గ్రూప్ ఆదివారం ప్రకటించింది. అయితే, ఎప్పుడు, ఎక్కడ జరిగిన దాడిలో ఆయన చనిపోయాడన్న వివరాలు వెల్లడించలేదు. అహ్మద్ గతంలో మూడుసార్లు ఇజ్రాయెల్ దాడుల నుంచి తృటిలో తప్పించుకోగా, ఇటీవల నాలుగోసారి దాడికి గురై చనిపోయినట్లు మీడియా తెలిపింది. 

కాగా, వెస్ట్ బ్యాంక్ లో గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 8 మంది పాలస్తీనియన్లు చనిపోయారని పాలస్తీనియన్ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ కు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో శనివారం రాత్రి వెస్ట్ బ్యాంక్ లో ఇద్దరు పాలస్తీనియన్లను మిలిటెంట్లు చంపేశారు.

26 మంది ఇజ్రాయెల్​ పౌరులు ఇంటికి..

కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 4 రోజుల్లో 50 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ .. 150 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేయాల్సి ఉంది. హమాస్ వద్ద 240 మంది బందీలు ఉండగా.. ఇజ్రాయెల్ వద్ద 7,200 మంది పాలస్తీనియన్ ఖైదీలు ఉన్నారు. థాయిలాండ్ పౌరులను మినహాయిస్తే రెండ్రోజుల్లో 26 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ రిలీజ్ చేసింది.

 సోమవారం నాటికల్లా ఇంకా 24 మందిని విడుదల చేయాల్సి ఉంది. 50 మందికి మించి అదనం గా రిలీజ్ చేసే ప్రతి 10 మంది బందీలకు ఒకరోజు చొప్పున కాల్పులు ఆపేయడానికి  ఇజ్రాయెల్ అంగీక రించింది. దీంతో బందీల విడుదలనుబట్టి డీల్ పొడిగింపు ఉంటుందా? లేదా? అనేది తేలనుంది.