బీఆర్ఎస్ అభ్యర్థులకు..నిరసన సెగలు

బీఆర్ఎస్  అభ్యర్థులకు..నిరసన సెగలు
  • ఏం డెవలప్  చేశారని ఎక్కడికక్కడ లీడర్లను నిలదీస్తున్న స్థానికులు-
  • అభివృద్ధి జరగలేదని కొమురవెల్లి మండలం తపాస్పల్లిలో 26 అంశాలతో ఫ్లెక్సీలు
  • బీఆర్ఎస్ కు ఓటు వేయబోమని గ్రామస్థుల హెచ్చరిక
  • తమకు పోడు పట్టాలు ఎందుకు ఇవ్వలేదని పద్మా దేవేందర్ పై దళితుల ఫైర్

కొమురవెల్లి/మెదక్/యాదాద్రి/గంగాధర, వెలుగు : బీఆర్ఎస్  అభ్యర్థులకు నిరసన సెగలు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి గ్రామంలో బీఆర్ఎస్  జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. మండలంలోని రసూలాబాద్, అయినాపూర్, తప్పాపల్లి, పోసానిపల్లి, గురువన్నపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. తపాస్పల్లి గ్రామంలో స్థానికుల నుంచి ఆయనకు నిరసన ఎదురైంది. పదేండ్లుగా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ 26  అంశాలతో కూడిన ఫ్లెక్సీలను స్థానికులు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయబోమని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కరిస్తానని పల్లా హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు.

మెదక్​లో పద్మా దేవేందర్​రెడ్డికి

ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మెదక్  అసెంబ్లీ బీఆర్ఎస్  అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి రెండు గ్రామాల్లో నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆమె మెదక్  మండలం పాతూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పాదయాత్రగా వెళ్తుండగా కొందరు యువకులు బైక్​లు అడ్డుపెట్టి ఆమెకు నిరసన తెలిపారు. కర్ర పట్టుకుని వస్తున్న ఓ యువకుడిని బీఆర్ఎస్  నాయకులు అడ్డుకున్నారు. దీంతో యువకులకు, బీఆర్ఎస్​ నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం హవేలీ ఘనపూర్  మండలం గంగాపూర్ గ్రామంలో కూడా పద్మకు నిరసన సెగ తగిలింది. గిరిజనులకు మాత్రమే పోడు భూమి పట్టాలిచ్చారని, దళితులకు ఎందుకు ఇవ్వలేదని పలువురు స్థానికులు ఆమెను నిలదీశారు. గంగాపూర్ గ్రామంలో సమస్యలు అలాగే ఉన్నాయని, డెవలప్​మెంట్​ ఏమీ జరగలేదంటూ ఫైర్  అయ్యారు.

సమాధానం చెప్పకుండా వెళ్లిన సునీత

ఎన్నికల ప్రచారంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ఊహించని పరిణామం ఎదురైంది. సునీత శుక్రవారం యాదాద్రి జిల్లా గుండాల మండలంలో ప్రచారం చేశారు. తన తండ్రి నాలుగేండ్ల క్రితం చనిపోయాడని, తన తల్లికి ఇంకా పింఛన్  ఎందుకు రావడం లేదని బండ కొత్తపల్లికి చెందిన అంజయ్య ఎమ్మెల్యేను ప్రశ్నించాడు. సమాధానం చెప్పకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వస్తాకొండూరులో సునీత రోడ్​ షో నిర్వహించారు. అభివృద్ధి చేశామని చెబుతూ బీజేపీ, కాంగ్రెస్​పై ఆమె విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ‘‘మా గ్రామానికి ఏం చేశారు?” అని ప్రశ్నించాడు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్​ లీడర్​ యాదగిరి ఆ వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించారు. అతడి మెడపై చేయి వేసి బయటకు నెట్టుకుంటూ వెళ్లాడు. పోలీసులు అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. తర్వాత గుండాల మండలం పాచిళ్లలో సునీత ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసినోళ్లందరూ లీడర్లు కారని అన్నారు. పనిచేసినోళ్లలో కొందరిని లీడర్లను చేసి సముచిత హోదా కల్పించామన్నారు.

దేవరకొండ ఎమ్మెల్యేపై తండావాసుల ఫైర్

కొండమల్లేపల్లి, వెలుగు : దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కూ నిరసన సెగ తగిలింది. శుక్రవారం కొండమల్లేపల్లి మండలం వడ్త్య తండా, చింతచెట్టు తండా, రామగుండ్ల తండాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా తండా వాసులు ఎమ్మెల్యేను అడ్డుకొని నిరసన తెలిపారు. దేవరకొండ నుంచి గాజీనగర్ వడ్త్య తండా వెళ్లే దారిలో ఉన్న మురికికుంట పొంగి రోడ్డుపై పారుతున్నదని, బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని వడ్త్యతండా వాసులు మండిపడ్డారు. చింతచెట్టు తండాలో డ్రైనేజీ సమస్య అలాగే ఉందని, రామగుండ్ల తండాలో మిషన్  భగీరథ నీరు రావడం లేదని గ్రామస్తులు ఫైర్  అయ్యారు.

ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

కరీంనగర్  జిల్లా గంగాధర మండలం హిమ్మత్​నగర్​లో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్  ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు శుక్రవారం అడ్డుకున్నారు. హిమ్మత్​నగర్​లో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా.. అసంపూర్తిగా ఉన్న తాడిజెర్రి, వెదిర రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని వారు డిమాండ్​ చేశారు. తాడిజెర్రి,- వెదిర రోడ్డు కంకర తేలి ప్రమాదకరంగా మారిందని ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడ్డారు.