- ఆరెంజ్ స్కూల్‌పై స్టూడెంట్ల తల్లిదండ్రుల ఫైర్
- ఇంకా ప్రైవేట్ హాస్పిటల్‌లో కామెర్లకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మరో ఐదుగురు స్టూడెంట్లు
మేళ్లచెరువు, వెలుగు: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే తమ బిడ్డను బలి తీసుకుందంటూ సోమవారం మృతి చెందిన బాలుడి పేరెంట్స్ ఆఫీసర్ల ఎదుట విలపించారు. మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఆరెంజ్ స్కూల్(కృష్ణవేణి) లో కలుషిత నీరు తాగి గత సెప్టెంబర్ నుంచి వంద మంది స్టూడెంట్లు కామెర్ల బారినపడ్డారు. ఈ క్రమంలోనే మేళ్లచెరువు కు చెందిన శాగంరెడ్డి శంభిరెడ్డి ఆరేళ్ల కుమారుడు సుజిత్ రెడ్డి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు.
గత సెప్టెంబర్ నెలలో రెండు కేసులు స్కూల్ లో వెలుగు చూశాయి. చూస్తుండగానే ఒకరి నుంచి మరొకరికి కామెర్లు సోకాయి. జిల్లా వైద్య బృందం హెల్త్ క్యాంప్ ద్వారా పరీక్షలు జరిపారు. ఆ తర్వాత అటు స్కూల్ మేనేజ్మెంట్, స్థానిక ప్రభుత్వ వైద్యాధికారులు పట్టించుకోవడం మానేశారు.
స్కూల్ వాటర్ ప్లాంట్‌లో శాంపిల్స్ ఎందుకు సేకరించలే..
తీవ్ర కలుషిత నీరు తాగడం వలన లివర్ డ్యామేజ్ జరుగుతుందని జిల్లా ఎపిడమాలజిస్ట్ సతీష్ గౌడ్ తెలిపారు. ఆరెంజ్ స్కూల్ కు చెందిన మరో ఐదుగురు స్టూడెంట్లు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం ఆ విషయాన్ని తమకు చెప్పలేదని వైద్య బృందంలోని ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీశైలం అన్నారు. తమ పిల్లలకు కామెర్లు ఎలా సోకాయో చెప్పాలంటూ డిప్యూటీ డీఎంహెచ్ఓ జయమనోరిని పేరెంట్స్ నిలదీశారు. అన్ని చోట్ల వాటర్ శాంపిల్స్ సేకరించి స్కూల్ ప్లాంట్ లో ఎందుకు సేకరించలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంపిల్స్ సేకరించడానికి వచ్చినప్పటికే వాటర్ ప్లాంట్ ను డ్రై చేసి ఉంచారని, ఆ ఒక్క నీటి ప్లాంట్ శుద్దతపై తమకు అనుమానం ఉందని ఆమె తెలిపారు.
రెండ్రోజుల్లో హెల్త్ క్యాంప్ లు...
సదరు స్కూల్ లో స్టూడెంట్లందరికీ సీబీపీ, ఎల్ టీఎఫ్ టెస్ట్ లు నిర్వహిస్తామని వైద్య బృదం వెల్లడించింది. మండలంలో ఇంటింటి సర్వే చేపడతామని తెలిపారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ బాలుడి బంధువుల ఆందోళన చేశారు. ఫిట్స్ తో తమ కుమారుడు చనిపోయాడని స్కూల్ మేనేజ్మెంట్ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కలుషిత నీరు తాగడం వలనే తమ బాబు చనిపోయాడని ఖమ్మం డాక్టర్లు చెబితే ఇక్కడి డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని పీహెచ్‌సీలో జిల్లా వైద్య బృందాన్ని నిలదీశారు. స్కూల్ ను వెంటనే సీజ్ చేసి స్టూడెంట్లందరికీ వైద్య పరీక్షలు జరపాలని సీపీఎం, డీవైఎఫ్ ఐ,ఎస్ ఎఫ్ ఐ నాయకులు ఎంఈఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేసి వినతి పత్రం అందజేశారు.
