గాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు

 గాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు
  • పరిగి ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లకు డ్యూటీలో ఒక్కరే
  • ఆటోను ఢీకొట్టిన కారు.. 16 మందికి గాయాలు
  • సర్కారు దవాఖానకు పోతే ప్రైవేటుకు పంపించిన సిబ్బంది
  • ప్రైవేటు ఆసుపత్రిలో ఒకరు.. మార్గంమధ్యలో ఇద్దరు మృతి


పరిగి, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి పోతే చికిత్స చేసేందుకు డాక్టర్లే లేరు. డ్యూటీలో 9 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కరే ఉన్నారు. ఈ నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన వారిని ప్రైవేటు వెళ్లమని సిబ్బంది సూచించారు. దీంతో ముగ్గురిని ఇతర ఆసుపత్రులకు తరలించగా.. ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఒకరు, మార్గమధ్యంలో మరో ఇద్దరు చనిపోయారు. వికారాబాద్ జిల్లాలో జరిగిందీ దారుణ ఘటన.

పరిగికి వెళ్తుండగా..

శుక్రవారం ఉదయం మహబూబ్​నగర్ జిల్లా వెన్నచేడుకు చెందిన మద్ద దస్తయ ప్యాసింజర్ ఆటోలో 15 మందితో కలిసి రంగారెడ్డి పల్లి మీదుగా వికారాబాద్ జిల్లా పరిగికి బయలుదేరాడు. కర్నాటకలోని గుర్మిట్కల్‌‌కు చెందిన సురేశ్ హైదరాబాద్ నుంచి సొంతూరుకు కారులో బయల్దేరాడు. పరిగి శివార్లలో వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లు దగ్గరికి చేరుకోగానే ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సురేశ్, ఆటో డ్రైవర్ దస్తయ, దోమ మండలం పీర్లగుట్ట తండాకు చెందిన యమ్లీ బాయి (58), గుండాల్‌‌కు చెందిన శశికళ(37), కొత్తపల్లికి చెందిన బోయిని అంజిలమ్మ (65), బ్రాహ్మణపల్లికి చెందిన హరిజన్ పోచమ్మ, హరిజన్ దస్తమ్మ, పెద్దతండాకు చెందిన నేనావత్ అరుణ, దస్తమ్మ, హరిజన్ మానస, గుండాల గ్రామానికి చెందిన దొర కావ్య, కార్తీక్, కోళ్ల సౌమ్య, మల్లేపల్లికి చెందిన గడ్డం అంజయ్య, చంద్రయ్య, గంజిపల్లికి చెందిన లలితకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ యమ్లీబాయిని వికారాబాద్‌‌కు తీసుకెళ్లగా.. ప్రైవేటు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ చనిపోయింది. అంజిలమ్మ, శశికళను హైదరాబాద్‌‌కు తరలిస్తుండగా మొయినాబాద్ దగ్గర ఒకరు, పూడూరు గేట్ దగ్గర మరొకరు చనిపోయారు.

ఒకే బెడ్‌‌పై ఇద్దరికి చికిత్స

ప్రమాదంలో గాయపడ్డ వారిని మొదట పరిగి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. కానీ వారికి ట్రీట్​మెంట్ అందించేందుకు డాక్టర్లు లేరు. ఈ దవాఖానలో మొత్తం 9 మంది డాక్టర్లు పనిచేస్తుండగా.. బాధితులను తీసుకొచ్చిన టైమ్​లో డ్యూటీలో డాక్టర్ రేహాన్ ఒక్కరే ఉన్నారు. సిబ్బంది ఉన్నప్పటికీ గాయపడ్డ వారికి వైద్యం అందించడం కష్టమైంది. మరోవైపు జనరల్ వార్డులో బెడ్లు ఫుల్ కావడంతో.. ఒకే బెడ్‌‌పై ఇద్దరికి చికిత్స అందించారు. కొందరికి చెట్ల కిందనే ట్రీట్​మెంట్ అందించారు. కొంతసేపటి తర్వాత మరో డ్యూటీ డాక్టర్ అంబ ప్రసాద్ ఆసుపత్రికి వచ్చారు. మిగతా ఏడుగురు మాత్రం ఆ సమయంలో ఆసుపత్రిలో లేరు.