జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 20 నుంచి ఆగ‌స్టు 11వ తేదీ వ‌ర‌కు వర్షాకాల స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ప్రారంభించినా..ఈ వర్షాకాల సమావేశాలు మాత్రం పాత బిల్డింగ్‌లోనే జ‌రగనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్లమెంట్ భ‌వ‌నంలో కొన్ని ప‌నులు పెండింగ్‌లో ఉండటంతోనే ఈ వర్షాకాల సమావేశాలు పాత బిల్డింగ్ లోనే నిర్వహించనున్నట్లు స‌మాచారం. 

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలపై కేంద్ర పార్లమెంట‌రీ వ్యవ‌హారాల‌శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ట్వీట్టర్లో తెలిపారు. జులై  20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతాయి. పార్లమెంటరీ కమిటీ క్యాబినెట్ కమిటీ ఈ సమావేశాల తేదీల్ని ఖరారు చేసింది.  రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నాను.. .అని  ప్రహ్లాద్ జోషి అధికారికంగా ట్వీట్ చేశారు. 

ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్‌  బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. దీంతో పాటు ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీలకు సంబంధించి కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన జాతీయ పరిశోధనా ఫౌండేషన్‌కు సంబంధించిన బిల్లు కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.