గజ్వేల్​, మెదక్​లలో  రేక్​ పాయింట్లకు గ్రీన్​ సిగ్నల్​ 

గజ్వేల్​, మెదక్​లలో  రేక్​ పాయింట్లకు గ్రీన్​ సిగ్నల్​ 
  • స్టాక్​ నిల్వకు భారీ గోడౌన్ల నిర్మాణం
  • రైతులకు, వ్యాపారులకు ఉపయోగకరం 
  • వేలాది మంది కూలీలకు దొరకనున్న పని 

మెదక్/సిద్దిపేట, వెలుగు : దశాబ్దాల ఎదురు చూపుల తరువాత ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, మెదక్ పట్టణాలకు రైల్వే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దాంతోపాటు రెండు చోట్ల రైల్వే రేక్ పాయింట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. రైల్వే రాకతో ఉమ్మడి జిల్లా వారు దూర ప్రాంతాలకు రాకపోకలు సులువుకానున్నాయి.  రేక్​ పాయింట్లతో జిల్లాతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం కలుగనుంది. రేక్​ పాయింట్లతో ఎరువులు, పీడీఎస్​ రైస్, పత్తి, సిమెంట్, స్టీల్​ తదితర సామగ్రి ట్రాన్స్​పోర్టేషన్​ సులభతరం కానుంది.

ప్రధాన కేంద్రంగా గజ్వేల్..
విత్తనాలు, వ్యాపార సామగ్రి, వ్యవసాయోత్పత్తులు, పత్తి బేల్లను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి గజ్వేల్ రేక్ పాయింట్ ప్రధాన కేంద్రంగా మారనుంది. దీని ద్వారా మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ జిల్లాలకు ఎరువులను త్వరగా పంపడానికి వీలవుతోంది.  గతంలో బియ్యం నిల్వకు, ఎరువుల కోసం హైదరాబాద్ లోని సనత్ నగర్ కు వెళ్లేవారు. గజ్వేల్ రేక్ పాయింట్ ఏర్పాటు ద్వారా ఇకపై ఇక్కడి నుంచే ఎరువులు, ధాన్యం రవాణాకు అవకాశాలు ఏర్పడ్డాయి.  గత నెల 27న గజ్వేల్ రైల్వే స్టేషన్ కు కాకినాడ నుంచి 21 బోగీల్లో దాదాపు 48 వేల ఎరువుల బస్తాలు వచ్చాయి. ఇక్కడి నుంచి సమీప జిల్లాలకు తరలించే విధంగా గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేతో అనుసంధానం చేసుకుని ఎఫ్ సీఐ, మార్క్ ఫెడ్ లు తమ నిల్వలను భద్రపరచుకోవడానికి ఏర్పాట్లు చేసుకునే అవకాశం లభించింది. ఎరువులను నిల్వ చేయడానికి నాలుగు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ల ను ఇప్పటికే ఏర్పాటు చేశారు.

త్వరలో మెదక్..
సికింద్రాబాద్–నిజామాబాద్ రూట్​లోని రామాయంపేట మండలం అక్కన్నపేట దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు 17.20 కిలోమీటర్ల దూరం రైల్వే లైన్​ నిర్మాణం పూర్తయింది. ఇటీవలే సౌత్​సెంట్రల్​ రైల్వే ఆఫీసర్లు గూడ్స్​రైల్, ప్యాసింజర్ రైళ్లతో ట్రయల్​ రన్​ కూడా నిర్వహించారు. త్వరలో ప్యాసింజర్​ రైళ్ల రాకపోకలు షురూ కానుండగా, మరికొద్ది రోజుల్లో మెదక్​లో రేక్ ​పాయింట్​ఏర్పాటు కానుంది. సరుకుల నిల్వకోసం గోడౌన్ల నిర్మాణం చేపట్టనున్నట్టు కలెక్టర్ హరీశ్​ తెలిపారు. ఇందుకోసం 30 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించామని, త్వరలో సివిల్​సప్లై డిపార్ట్​మెంట్​కు అప్పగిస్తామన్నారు. ఇదిలా ఉంగా రైల్వే రేక్ ​పాయింట్ల ఏర్పాటుతో రైస్​ మిల్లర్లకు, వ్యాపారులకు, రైతులకు ఎంతో ఉపయోగం కలుగనుండటంతోపాటు సరుకుల ఎగుమతి, దిగుమతి ద్వారా స్థానికంగా వేలాది మంది కూలీలకు ఉపాధి లభించనుంది.