
- రేడియాలజిస్ట్, టెక్నీషియన్ లేక మూలకుపడ్డ రూ.2.50 కోట్ల సీటీ స్కానింగ్ మెషీన్
- పత్తా లేని పేషెంట్కేర్ ఎంప్లాయిస్
- పేషెంట్లు తిప్పలు పడుతున్నా పట్టించుకోని అధికారులు
గద్వాల, వెలుగు: గద్వాల సర్కార్ దవాఖానలో పేషెంట్లకు సరైన వైద్యం అందక ఇబ్బంది పడుతున్నారు. రేడియాలజిస్ట్ లేకపోవడంతో రూ.2.50 కోట్లతో సమకూర్చిన సీటీ స్కానింగ్ మెషీన్ మూలకుపడింది. హాస్పిటల్లో ఎక్స్‌రేలు తీస్తే ఫిల్మ్‌లు ఇవ్వకపోవడంతో, పేషెంట్లు బయట ఎక్స్‌రేలు తీయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైద్యం కోసం వచ్చిన వారికి సహకరించాల్సిన పేషెంట్ కేర్ యూనిట్ ఎంప్లాయిస్ పత్తా లేకుండా పోయారు. దీంతో జిల్లా ఆసుపత్రికి వస్తున్న పేషెంట్లు తిప్పలు పడుతున్నారు.
సీటీ స్కానింగ్ చేయట్లే..
గద్వాల హాస్పిటల్ కు రెండేళ్ల కింద రూ.2.50 కోట్ల విలువైన సీటీ స్కానింగ్ మెషీన్‌ను ప్రభుత్వం సమకూర్చింది. కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీటీ స్కానింగ్ ను ఓపెన్ చేశారు. అయితే రేడియాలజిస్టు, టెక్నీషియన్ లేకపోవడంతో ఓపెన్ చేసినప్పటి నుంచి సీటీ స్కాన్ సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఎమర్జెన్సీలో హాస్పిటల్ లోని డాక్టర్లు సీటీ స్కాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సీటీ స్కానింగ్ సేవలు అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లు గద్వాలలోని ప్రైవేట్ ల్యాబ్ కు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో స్కానింగ్‌కు ప్రైవేట్‌లో రూ. 3,500 నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
గర్భిణులకూ ప్రైవేట్‌లోనే స్కానింగ్..
గర్భిణులు స్కానింగ్ కోసం బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు 30 నుంచి 50 మంది గర్భిణులు ప్రైవేట్ ల్యాబ్ లో స్కానింగ్ చేయించుకుంటున్నారు. ఒకసారి స్కాన్ చేయించుకుంటే రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు ఖర్చవుతోంది. గద్వాల ఆసుపత్రిలో స్కానింగ్ అందుబాటులో లేకపోవడంతో ఈ పరిస్థితి ఉందని అంటున్నారు. ప్రైవేట్ స్కానింగ్, సీటీ స్కానింగ్ సెంటర్లలో గవర్నమెంట్ డాక్టర్లకు వాటా ఉండడంతో, ప్రభుత్వ హాస్పిటల్ లో స్కానింగ్ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే పేషెంట్లకు ఎక్స్‌రే తీసి ఫిల్మ్ ఇవ్వడం లేదు. ఫిల్మ్‌ను ఆన్ లైన్ లో డాక్టర్ కు పంపిస్తామని సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేషెంట్లు వాపోతున్నారు. ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
రోగులను పట్టించుకుంటలేరు..
హాస్పిటల్ కు వచ్చే రోగులకు ఎక్కడెక్కడ ఏ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు నడవ లేని వారిని వీల్ చైర్, స్ట్రెచర్‌పై డాక్టర్ వద్దకు తీసుకెళ్లేందుకు వీలుగా గద్వాల ఆసుపత్రిలో 8 మంది పేషెంట్ కేర్ ఉద్యోగులను నియమించారు. నలుగురు ఎంఎల్ వో(ప్రాథమిక చికిత్స చేసేందుకు)లను నియమించింది. కానీ, వీరు అందుబాటులో ఉండడం లేదు.
అందుబాటులోకి తెస్తాం..
రేడియాలజిస్టు లేకపోవడంతో స్కానింగ్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని మాట వాస్తవమే. త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఎమర్జెన్సీ పేషెంట్లకు సీటీ స్కానింగ్ చేస్తున్నాం. ఎక్స్‌రే ఫిల్మ్‌ను ఆన్ లైన్ లో డాక్టర్ కు పంపిస్తున్నాం. పేషంట్ కేర్ విభాగంపై దృష్టి పెడతాం. - ఇందిర, హాస్పిటల్ సూపరింటెండెంట్