ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిన్రు.. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నరు

ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిన్రు.. కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నరు
  • కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్​ను అసెంబ్లీలో పెట్టిన సర్కార్
  • 2017 డిసెంబర్ వరకూ ఫౌండేషన్ వేయనేలేదు.. 2019 జూన్ నాటికి బ్యారేజీలను ప్రారంభించేశారు
  • క్వాలిటీ ఎట్లుంటదో అర్థం చేసుకోవచ్చు
  • ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు.. వ్యక్తుల నిర్ణయం
  • కేబినెట్ అప్రూవల్ కూడా తీసుకోలేదని తేల్చి చెప్పిన కమిషన్ 

హైదరాబాద్, వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆదరాబాదరాగా కట్టిందని తేలిపోయింది. కేవలం ఏడాదిన్నరలోనే బ్యారేజీలను పూర్తి చేసింది. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2017, డిసెంబర్​లో అధికారులు బ్యారేజీల నిర్మాణ స్థలాల్లో ఫౌండేషన్ వేసేందుకు నేలను చదునుచేసే పనులపై దృష్టి పెట్టారని, అది కూడా ఒకటి, రెండో బ్లాకులకు కాదని.. మేడిగడ్డ బ్యారేజీ ఫౌండేషన్​కు తవ్వకాలు ప్రారంభించారని రిపోర్ట్​లో కమిషన్ తేల్చింది. 2019, జూన్ నాటికే బ్యారేజీలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపింది. ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేసిందని పేర్కొన్నది.  అందులోనూ జనవరి నుంచి జూన్ వరకే నిర్మాణానికి ఆస్కారం ఉంటుంది. ఈ లెక్కన బ్యారేజీలను ఏడాదిలోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసినట్లు స్పష్టమైంది. ఇంత తక్కువ టైంలో బ్యారేజీలు నిర్మించారంటే వాటి నాణ్యత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని రిపోర్టులో కమిషన్ పేర్కొన్నది. పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఈఎన్​సీ, ఏజెన్సీల మధ్య నిర్వహించే మేనేజ్​మెంట్ మీటింగ్స్ రికార్డులు కూడా అందుబాటులో లేవని స్పష్టం చేసింది.

క్రిమినల్ నెగ్లిజెన్స్​..

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని, ఇది వ్యక్తులు తీసుకున్న నిర్ణయమని కమిషన్ రిపోర్టు స్పష్టం చేసింది. అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. ఎక్స్​పర్ట్ కమిటీ నివేదికను కేసీఆర్ తొక్కిపెట్టి ఏకపక్షంగా మేడిగడ్డకు లొకేషన్ మార్చారని స్పష్టం చేసింది. ప్లానింగ్​, నిర్మాణం, ఆపరేషన్ల వరకు అడుగడుగునా కేసీఆర్  ప్రమేయం ఉందని తెలిపింది. అందుకు అనుగుణంగానే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారని చెప్పింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని తేల్చింది. అదే చివరికి బ్యారేజీలు కుంగేదాకా వెళ్లిందని స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్థిక ఖజానాను కాపాడాల్సిన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్.. నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపింది. ఇందులో ప్రభుత్వ నిర్ణయాల కన్నా రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపించిందని తెలిపింది. తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదాలే లేవని స్పష్టం చేసింది. 

హైపవర్ కమిటీ మీటింగ్​లో ఈ 3 బ్యారేజీల నిర్మాణంపై ఓకే చెప్పలేదని తేల్చి చెప్పింది. ఇక కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం కూడా లేదని కమిషన్​ పేర్కొన్నది. కేబినెట్ సబ్ కమిటీని అప్పటికే చేపట్టిన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ పర్పస్​కు వేశారని, అందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించిన అంశాలేం లేవని చెప్పింది. ఆ మూడు బ్యారేజీల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయలేదని పేర్కొన్నది.

అడుగడుగునా విధుల్లో నిర్లక్ష్యం

చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికారులు అడుగడుగునా విధుల్లో నిర్లక్ష్యం వహించారని కాళేశ్వరం కమిషన్​ తన రిపోర్టులో పేర్కొన్నది. సిన్సియర్​గా పనిచేయలేదని, కోఆర్డినేషన్ సరిగ్గా లేదని, బాధ్యతారహితంగా వ్యవహరించారని తెలిపింది. అప్పటి ఇరిగేషన్​ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎస్కే జోషి, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, రిటైర్డ్ ఈఎన్​సీ మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లుపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అంతేగాకుండా, సీడీవో సీఈ, బ్యారేజీల అంచనాల పెంపును ఇష్టారాజ్యంగా ఆమోదించిన స్టేట్ లెవెల్​ స్టాండింగ్ కమిటీ సభ్యులు, డ్యామ్​ సేఫ్టీ అధికారులు, మోడల్​ స్టడీస్​ను సరిగ్గా చేయని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. 

ఫీల్డ్ స్టడీస్​ లేకుండానే డిజైన్లు

ఫీల్డ్ స్టడీస్ చేయకుండానే ఇరిగేషన్ డిపార్ట్​మెంట్​లోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) డిజైన్లు చేసిందని రిపోర్టులో కమిషన్​ పేర్కొన్నది. మోడల్​ స్టడీస్​ను కూడా పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది. కేవలం ‘కోడ్స్​’, మాన్యువల్​లోని అంశాల ఆధారంగానే సీడీవో డిజైన్లు చేసిందని ఆక్షేపించింది. నేలతీరును తెలుసుకునే టెస్టులు చేయలేదని, భూమి గట్టిదనాన్ని పరీక్షించలేదని తెలిపింది. కేవలం హైపవర్​ కమిటీ మీటింగ్​లో చెప్పారన్న కారణంతోనే డిజైన్లను ఎలాంటి ఫీల్డ్​ స్టడీస్​ చేయకుండానే డిజైన్లు చేశామని సంబంధిత అధికారులు చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని తేల్చి చెప్పింది. డ్రాయింగ్స్ విషయంలో హైపవర్ కమిటీ అధికారాలు ఎంతవరకుంటాయని ప్రశ్నించింది. డిజైన్ల విషయంలో బ్యారేజీలు కుంగిన 2019లోనే సీడీవో స్పందించడం గమనార్హమని అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు సరైన సమయం ఇవ్వలేదని అప్పుడు సీడీవో చెప్పిందని, డిజైన్లలో ఎల్ అండ్ టీ సంస్థ కూడా ఇన్వాల్వ్ అయినట్టు రిపోర్ట్​లో కమిషన్ వెల్లడించింది. డిజైన్లు ప్రిపేర్ చేసిన సీడీవో సీఈ సహా ఇతర ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

తుమ్మిడిహెట్టిపై ఎక్స్​పర్ట్స్ కమిటీ రిపోర్ట్​ను తొక్కిపెట్టారు

తుమ్మిడిహెట్టిపై ఎక్స్​పర్ట్స్ కమిటీ రిపోర్టును గత కేసీఆర్ ప్రభుత్వం కావాలని తొక్కిపెట్టిందని రిపోర్టులో కమిషన్ పేర్కొన్నది. నీటి లభ్యత లేదని, భవిష్యత్​లో ఎగువ రాష్ట్రాలు వినియోగించుకుంటే తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లుండవేమోనని సీడబ్ల్యూసీ, ఉమాభారతి చెప్పారనడాన్ని కమిషన్ తోసిపుచ్చింది. మేడిగడ్డ వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంటుందని సీడబ్ల్యూసీ చెప్పిన విషయాన్ని రిపోర్టులో ప్రస్తావించింది. కాబట్టి, నీళ్లు లేవన్న సాకు చూపి తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్​ మార్చడం నిజాయితీతో కూడిన నిర్ణయంలా కనిపించడం లేదని స్పష్టం చేసింది. ఇక, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను వ్యాప్కోస్​ డీపీఆర్​లో మెన్షన్​ చేయలేదని తెలిపింది.

మహారాష్ట్రతో మీటింగ్ కన్నా ముందే నిర్ణయం

తుమ్మిడిహెట్టి ఎత్తుపై మహారాష్ట్రతో ఇంటర్ స్టేట్ బోర్డు మీటింగ్​కన్నా ముందే అప్పటి సర్కారు మేడిగడ్డకు లొకేషన్ మార్చడంపై నిర్ణయం తీసుకున్నదని కమిషన్ రిపోర్టు తేల్చి చెప్పింది. 2016, ఆగస్టు 23న బోర్డు మీటింగ్ జరగ్గా.. అంతకన్నా ముందే అంటే 2016, మార్చి 1నే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిందని స్పష్టం చేసింది. ఆ వెంటనే జూలై, ఆగస్టుల్లో నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులనూ అప్పగించిందని తెలిపింది. ఆ తర్వాతే సీడబ్ల్యూసీ అనుమతుల కోసం 2017, ఫిబ్రవరిలో ప్రభుత్వం డీపీఆర్​ సమర్పించిందన్నారు. అంతేగాదు.. 2018, మే 1నాటికి ప్రాజెక్టు ఆర్థికాంశాలపైనే సీడబ్ల్యూసీ పరిశీలన చేస్తున్నదని తేల్చి చెప్పింది. అప్పటికీ ప్రాజెక్టుకు అనుమతి రాలేదని పేర్కొన్నది.

వీళ్లపై చర్యలు తీసుకోవాల్సిందే..

బిజినెస్ రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరించినందుకు మాజీ ఇరిగేషన్ శాఖ సెక్రటరీ ఎస్కే జోషి, సీఎంవో మాజీ సెక్రటరీ స్మితా సబర్వాల్, మాజీ ఈఎన్​సీ మురళీధర్, ఈఎన్​సీ హరిరామ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మ్యాగ్జిమమ్ డిశ్చార్జ్​ ఫ్లడ్​పై 2015, అక్టోబర్ 16, 2016, ఏప్రిల్ 12 కాళేశ్వరం ప్రాజెక్ట్​ సీఈ లేఖలు రాస్తే.. రెండేండ్ల తర్వాత అంటే 2017, అక్టోబర్​ 25న స్పందించినందుకు హైడ్రాలజీ సీఈ శంకర్ నాయక్​పై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఏకపక్షంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను మార్చినందుకు, అంచనాలు పెంచినందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఎస్​ఈలు, సీఈ, హైపవర్ కమిటీ మెంబర్స్​పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది. అంచనాలను హేతుబద్ధత లేకుండా ఆమోదించినందుకు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ చైర్మన్, సభ్యులపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాంట్రాక్టులు అయిపోయాక 2017లో ఐఐటీ హైదరాబాద్​, ఎన్​ఐటీ వరంగల్​లతో ఫీల్డ్​ స్టడీస్​ చేయించిన ఈఎన్​సీ, ఎస్​ఈ, సీఈలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నది.