
హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఇప్పటి వరకు పలువురు నేతలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్టు మల్లు రవి తెలిపారు. అయితే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో దీనిపైనే ప్రధానంగా ఈ మీటింగ్ లో చర్చించనున్నట్టు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నాయి.
దీంతో ఈ మీటింగ్ పై పీసీసీలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ పై ఢిల్లీలో స్పందించారు. దీనిపై వాస్తవాలు ఏమిటో తెలుసుకొని ఆయన వివరణ కోరుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేయడంపై అందరిలో ఆసక్తికర చర్చ మొదలైంది.