తెలియకుండానే రూ. 7 పెరిగిన పెట్రోల్ ధర

తెలియకుండానే రూ. 7 పెరిగిన పెట్రోల్ ధర
  • గత 50 రోజుల్లో 28 సార్లు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
  • గగ్గోలు పెడుతున్న సామాన్య ప్రజానీకం

పెట్రోల్, డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దాంతో గత 50 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 28వ సారి. మే 4 తర్వాత దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 7 రూపాయలకు పైగా రేటు పెరిగింది. వరుసగా పెరుగుతున్న ధరల కారణంగా ఎనిమిది రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. ఇందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, జమ్ముకశ్మీర్, లఢఖ్‌లో పెట్రోల్ ధర వంద దాటింది. నేటి ధరల పెంపుతో బీహార్ రాజధాని పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర వందకు చేరువైంది. ఇక ముంబై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయల కంటే ఎక్కువగానే ఉంది. గతవారమే బెంగళూరు, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది.

ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల 63 పైసలుగా ఉండగా.. డీజిల్ ధర 95 రూపాయల 72 పైసలుగా ఉంది. ఇక ఢిల్లీలో మాత్రం పెట్రోల్ ధర కాస్త తక్కువగా ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 97 రూపాయల 5 పైసలు, డీజిల్ ధర లీటర్‌కు 88 రూపాయల 23 పైసలుగా ఉంది. ఇక దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్ శ్రీ గంగా నగర్‌లో లీటర్ పెట్రోల్ ధర 108 రూపాయల 67 పైసలుగా ఉంది. డీజిల్ ధర 101 రూపాయల 4 పైసలుగా ఉంది. 

పెట్రోల్,డీజిల్ రేట్ల పెంపుపై వినియోగ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. పెట్రో ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని వాపోతున్నారు.