వేగంగా యూఎస్‌‌తోవాణిజ్య చర్చలు : మంత్రి పీయూష్ గోయల్

వేగంగా యూఎస్‌‌తోవాణిజ్య చర్చలు : మంత్రి పీయూష్ గోయల్

న్యూఢిల్లీ: ఇండియా, యూఎస్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు వేగంగా సాగుతున్నాయని, ఒమన్‌‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌‌ (ఎఫ్‌‌టీఏ) చర్చలు దాదాపు ఖరారయ్యాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం  తెలిపారు. మోదీ ప్రభుత్వం మారిషస్, యూఏఈ, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా (ఈఎఫ్‌‌టీఏ), యూకేలతో ఎఫ్‌‌టీఏలు కుదుర్చుకుంది. అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. తదుపరి రౌండ్ సమావేశాల కోసం యూఎస్‌‌ బృందం ఆగస్టులో ఇండియాకు రానుంది.

 రెండు దేశాలు సెప్టెంబర్-–అక్టోబర్ నాటికి ట్రేడ్ అగ్రిమెంట్‌‌లో మొదటి దశను ఖరారు చేయాలని చూస్తున్నాయి.  ఇరు దేశాల మధ్య  వాణిజ్యాన్ని 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్‌‌ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఒమన్, యూరోపియన్‌‌ యూనియన్‌‌, న్యూజిలాండ్, చిలీ, పెరూతో కూడా చర్చలు సాగుతున్నాయని గోయల్ అన్నారు. ఆగస్టు 1లోపు యూఎస్–-భారత్ మధ్య మినీ ట్రేడ్ డీల్ సాధ్యమని తెలిపారు. కాగా, వచ్చే నెల 1 తర్వాత అమెరికాకు ఇండియా ఎగుమతులపై 26 శాతం టారిఫ్ పడుతుంది.