- రాజ్యసభ కొత్త చైర్మన్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఇటీవల ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ సోమవారం రాజ్యసభ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఆయనకు ప్రధాని మోదీ సహా సభ్యులు ఘన స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ మాట్లాడుతూ.. నిరాడంబరతకు మారు పేరు రాధాకృష్ణన్ అని, సుదీర్ఘ కాలంగా ఆయన ప్రజా సేవలో ఉన్నారని కొనియాడారు. ‘‘రైతు కుటుంబం నుంచి వచ్చిన రాధాకృష్ణన్ కీలక స్థాయికి ఎదిగారు. ఆయన ఎదుగుదల మన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రకు గవర్నర్‌గా, పుదుచ్ఛేరికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధాకృష్ణన్ విశేష సేవలు అందించారు.
గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రొటోకాల్‌ను కూడా పక్కనబెట్టి జనంలోకి వెళ్లేవారు. అదీ ఆయనకు ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావానికి ఉదాహరణ” అని ప్రశంసించారు. సమాజ సేవ చేయాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ రాధాకృష్ణన్ ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘రాధాకృష్ణన్ బాలుడిగా ఉన్నప్పుడు ఓ ఆలయ కోనేరులో పడిపోయారు. నీట మునగకుండా ఆయన చాకచక్యంగా బయటపడ్డారు. కోయంబత్తూర్‌లో ఎల్కే అద్వానీ యాత్రే లక్ష్యంగా జరిగిన బాంబు దాడి నుంచి కూడా రాధాకృష్ణన్ ప్రాణాలతో బయటపడ్డారు. బాంబు దాడిలో నాడు 70 మంది వరకు చనిపోయారు. ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడ్డ రాధాకృష్ణన్..
సమాజ సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు” అని మోదీ కొనియాడారు. ఓసారి రాధాకృష్ణన్ కాశీకి వచ్చినప్పుడు.. మాంసాహారాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారని, ఇదీ ఆయన ఆధ్యాత్మిక సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘ప్రజా జీవితంలోని సుదీర్ఘ అనుభవం, చిత్తశుద్ధి కలిగిన రాధాకృష్ణన్ ఇప్పుడు చైర్మన్ హోదాలో రాజ్యసభకు మార్గనిర్దేశనం చేయనున్నారు” అని ప్రధాని మోదీ తెలిపారు.
