ముందు పాక్​​కే చెప్పినం .. సర్జికల్ స్ట్రైక్స్​పై మోదీ వ్యాఖ్య

ముందు పాక్​​కే చెప్పినం .. సర్జికల్ స్ట్రైక్స్​పై మోదీ వ్యాఖ్య

బాగల్​కోట్(కర్నాటక): పాకిస్తాన్​లోని బాలాకోట్‌‌‌‌పై 2019లో సర్జికల్ స్ట్రైక్స్‌‌‌‌ చేశాక ఆ దేశానికే ముందుగా సమాచారం ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ తర్వాత మీడియాతో పాటు ప్రపంచ దేశాలకు ఈ దాడుల గురించి వివరించామని తెలిపారు. కర్నాటక బాగల్​కోట్​లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మీడియాకు సమాచారం ఇవ్వాలని ఆర్మీ కోరింది. కానీ.. నేను మాత్రం పాకిస్తాన్​కు ముందు చెప్పాలని సూచించాను. 

అదే రోజు రాత్రే పాకిస్తాన్ అధికారులకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. అయినా, కొద్దిసేపు ఆగి.. మళ్లీ ఫోన్ చేసి విషయం చెప్పాం. కర్నాటకలో బాగల్​కోట్ ఉంది. అందరూ బాలాకోట్ బదులు బాగల్​కోట్ అనుకుంటారని ఆ తర్వాత మీడియాకు సమాచారం ఇచ్చాం. అనంతరం ప్రపంచ దేశాలకు ఎయిర్​స్ట్రైక్స్ గురించి వివరించాం. దొంగచాటున దాడులు చేయడాన్ని నేను నమ్మను. ఏదైనా ఫేస్ టూ ఫేస్ తేల్చుకుంటా.

 నేను ఏదీ దాచుకోను..’’అని మోదీ అన్నారు. శత్రువుల భూభాగంలోకి వెళ్లి దాడి చేస్తామని, ఇది నయా భారత్ అని చెప్పారు. కాగా, మహారాష్ట్రలోని లాతూర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో టెర్రరిస్టు దాడులు జరిగేవి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్​కు సంబంధించిన డాక్యుమెంట్లను ఇండియా పాకిస్తాన్​కు అందజేసిందనే వార్తలు వచ్చేవి. ఇది చూసిన మీడియాలోని నా ఫ్రెండ్స్ కొందరు చప్పట్లు కొట్టేవారు’’అని అన్నారు. కాంగ్రెస్ హయాంలోని జరిగిన టెర్రరిస్ట్ కార్యకలాపాలతో పోలిస్తే గత పదేండ్లలో చాలా తగ్గాయన్నారు.

 ప్రధానమంత్రి పదవిని ఏడాదికొకరు చొప్పున పంచుకోవాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారని విమర్శించారు. ఐదేండ్లు.. ఐదుగురు ప్రధానులు వస్తారని, ఇన్​స్టాల్​మెంట్ రూపంలో దేశాన్ని పాలించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తర్వాత మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని మల్షిరాస్‌‌‌‌లో మోదీ మాట్లాడారు. ‘‘కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన ఒకతను అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏమీ చేయలేదు. ఇప్పుడు మళ్లీ చాన్స్ ఇవ్వాలని అంటున్నడు. మీరంతా కలిసి ఆయనకు బుద్ధి చెప్పాలి. ఆయనకు ఓటేసి అమూల్యమైన ఓటును వృథా చేసుకోవద్దు’’అని ఎన్సీపీ నేత శరద్​పవార్​ను ఉద్దేశిస్తూ పరోక్షంగా మోదీ విమర్శించారు.