మళ్లీ ముక్కోణ పోరు : దొమ్మాట వెంకటేష్

మళ్లీ ముక్కోణ పోరు : దొమ్మాట వెంకటేష్

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ  తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు  కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్న స్థితి నుంచి బీజేపీ అధిష్టానం రంగ ప్రవేశంతో  తెలంగాణ  రాజకీయ  ముఖచిత్రం మరోసారి మారిపోయింది. గడిచిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో  బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ వచ్చి బల్దియా, హుజురాబాద్ విజయంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అనంతరం జరిగిన రాజకీయ  పరిణామాల్లో మునుగోడు ఎన్నికలో పరాజయం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు, సౌమ్యంగా వ్యవహరించే కిషన్​రెడ్డి నియామకం కొత్త పరిణామాలు ఆ పార్టీ గ్రాఫ్​ని  పూర్తిగా పతనం చేశాయి.

ప్రభుత్వ వ్యతిరేకత  సమీకరణలు అన్నీ  బీజేపీ వైపు మళ్లుతున్న  తరుణంలో  బీజేపీ గ్రాఫ్ తగ్గి, కాంగ్రెస్ వైపు మళ్లింది. అనేక మంది బీజేపీ నేతలు ఆపార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, బీజేపీలో  చేరతారు అనుకున్న మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ ఎంఎల్​ఏ వేముల  వీరేశం, మాజీ మంత్రి జూపల్లి, మరో  సీనియర్ నేత తుమ్మల, మాజీ ఎంఎల్​ఏ  యన్నం శ్రీనివాస్ రెడ్డి  మాజీ ఎంఎల్​ఏ  మైనంపల్లి హనుమంతరావులాంటి వారు కాంగ్రెస్​లో చేరడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బెంగళూరులో  రచన ఢిల్లీలో ఆమోదం తెలంగాణలో అమలు అన్న మూడు అంచెల విధానాల్లో మూడు రంగుల జండా రెప రెపలాడుతోంది. 

ఊపు పెంచుతున్న మోదీ, షా

బీజేపీ బలహీనపడింది అన్న ప్రచారం హస్తినకు చేరడంతో, సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగ ప్రవేశంతో  సీన్ మారిపోయింది. మోదీ స్థాయిలో కేసీఆర్  వ్యవహార సరళిపై బహిరంగ ప్రకటన చేయడం, పాలనా అవినీతి విషయాలపై నోరు విప్పడంతో  తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బలమైన డిమాండ్​గానే మిగిలిపోయిన పసుపు బోర్డ్, గిరిజన యూనివర్సిటీలకు క్యాబినెట్ తీర్మానం చేయడం  కీలక పరిణామాలు.

అంతటితో ఆగకుండా చాలా ఏళ్లుగా నానుతున్న మాదిగ ఉపకులాల వర్గీకరణ చేయబోతున్నారన్న లీకులు ఇవ్వడం రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న  జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఎంబీసీ  కమిషన్​ను అమలు చేయబోతున్నారన్న వార్తలు  బీజేపీ గ్రాఫ్​ని జెట్ స్పీడ్​లో పెంచుతున్నాయి. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రాకముందే  జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల హీట్ పెంచాయి. అదే పరంపరలో రాష్ట్ర పార్టీలో గూడా సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. గత కొంత కాలంగా బాధ్యతలు ఇవ్వడం లేదని వరుసగా భేటిలైన నేతలను పనిలో పెట్టడం బీజేపీ ఢిల్లీ నేతల చాణిక్యం. 

మొదటి ఎన్నికల్లో సెంటిమెంట్​తో గట్టెక్కి, రెండవసారి సంక్షేమ పథకాలతో అధికారం చెలాయించిన కేసీఆర్ ముచ్చటగా మూడవసారి అవతలి పార్టీల్లో  సంక్షోభాలను సృష్టించి అధికారంలోకి రావాలన్న ఎత్తుగడ ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. చారణ కోడికి బారణ మసాలతో  అత్తెసరు పాలనకు చరమ గీతం పాడేందుకు కాంగ్రెస్, బీజేపీలు సమాయత్తం అవుతున్నాయి.

ముక్కోణపు పోరులో విజయం ఎవరిని వహిస్తుందో  వేచి చూడాల్సిందే.   కేసీఆర్​ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను కాంగ్రెస్, బీజేపీలు ఏమేరకు షేర్​ చేసుకుంటాయో,  మరోవైపు రెండు సార్లు అధికారం చెలాయించిన బీఆర్​ఎస్ కు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారో 50 రోజుల్లో తేలిపోనుంది.                 

హైదరాబాద్, రంగారెడ్డే మెజారిటీకి కీలకం

దక్షిణ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొంతమేర పుంజుకుంది. మొదటి నుంచి నల్లగొండ, మహబూబ్ నగర్ , ఖమ్మం, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్​కు పూర్వ వైభవం రావడం ఆ పార్టీకి కలిసి వచ్చే పరిణామం. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్​  ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో  బలహీనంగా ఉంది. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే బీజేపీ కొంత ప్రభావం చూపెడుతుంది. ముఖ్యంగా  ఒకనాడు నక్సలైట్ల  ప్రభావం, ఏజెన్సీ ఆనుకోని ఉన్న ప్రాంతాల్లో బీజేపీ పుంజుకోవడం  గమనార్హం.

తెలంగాణ వ్యాప్తంగా ఇంచుమించు ఒకే రకమైన గ్రాఫ్​తో ఉన్న బీఆర్ఎస్​కు ఉత్తర తెలంగాణలో బీజేపీ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల్లో వచ్చే సీట్ల పైనే అధికారం ఎవరిది అన్న అంశం ఆధారపడి ఉంటది. గడిచిన రెండు ఎన్నికల్లో  ఒంటిచేత్తో ఎన్నికలు నడిపిన కేసిఆర్ కు మూడవ ఎన్నికలు మూడు చెర్ల నీళ్లు తాపించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్​కు పూర్వ వైభవం దిశగా ప్రయాణం, బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం,  బీఆర్ఎస్​కు మింగుడు పడటం లేదు. హౌస్ అరెస్టులు, మీడియా మేనేజ్మెంట్ తో గట్టెక్కాలన్న కుయుక్తులకు తెరతీస్తున్నారు. అణచివేతకు, అక్రమ కేసులకు భయపడే చరిత్ర తెలంగాణ సమాజం రక్తంలో లేదు.

–దొమ్మాట వెంకటేష్, ఫ్రీలాన్స్​ జర్నలిస్ట్