అక్రమ ఇసుక రవాణపై స్పందించిన పొంగులేటి

అక్రమ ఇసుక రవాణపై స్పందించిన పొంగులేటి

సీజ్ చేసిన ఇసుక లారీలను వదలాలని మంత్రుల పీఏలు ఫోన్ చేయడం ఏంటని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం, భద్రాచలం జిల్లా మీదుగా  యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణ జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఆంధ్ర నుంచి ఇసుక తీసుకొచ్చి తెలంగాణలో అమ్ముతున్నారని అన్నారు. జిల్లాలో రెండు రోజుల క్రితం అక్రమ ఇసుక రవాణ చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. వాటిని విడిచి పెట్టాలని మంత్రుల నుంచి ఫోన్స్  వస్తున్నట్లు తెలిసిందని, ఆ విషయంపై బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పందించారు.  ఇసుక అక్రమరవాణాకు ప్రజాప్రతినిధులు, అధికారులు వత్తాసుపలకడం సరైంది కాదని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశించినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని, పాలసీ ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. 

అయితే గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని బీజేపీ శ్రేణులపై  కొందరు దుండగులు దాడులు చేశారని గుర్తు చేశారు. సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.  రాష్ట్రంలో ఇసుక అక్రమరవాణా జరగకుండా తక్షణమే ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.