ఇవాళ్టి నుంచి 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు

ఇవాళ్టి నుంచి 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు

బృహస్పతి(గురువు) ఏడాదికోసారి ఒక్కో రాశిలో  ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. అలా పన్నెండు రాశుల్లో బృహస్పతి సంచారంతో పన్నెండు నదులకు పుష్కరాలు వస్తాయి. అంటే గురువు మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగానదికి, సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి నదికి.. ఇలా గురువు ప్రవేశించిన రాశిని బట్టి ఒక్కో నదికి పుష్కరాలు జరుపుతారు. అలా ఈ  ఏడాది గురువు మీనరాశిలో ప్రవేశించడంతో  తెలంగాణలో ప్రవహించే ప్రాణహిత నదికి పుష్కరాలు వచ్చాయి. ఈ రోజు నుంచి పన్నెండు రోజుల పాటు అంటే ఈ నెల 24 వరకు జరిగే ఈ పుష్కరాల్లో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే ఆ సమయంలో నదిని పూజిస్తే  దేవతలందరి ఆశీర్వాదం అందినట్టే అని చెప్తారు భక్తులు. అంతేకాదు ఈ పుష్కరాలకి మరెన్నో విశిష్టతలున్నాయి. 

గోదావరి ఉపనదులలో అతి పెద్దదైన ప్రాణహిత మధ్యప్రదేశ్‌‌లోని సాత్పురా పర్వతాలలో వెన్‌‌గంగా, పెన్​గంగా, వార్ధా నదుల కలయికతో ఏర్పడింది. మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ ద్వారా  తెలంగాణలోని కుమ్రంభీం అసిఫాబాద్​ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టిలో అడుగుపెడుతుంది ఈ నది. అలా మహారాష్ట్ర, తెలంగాణ మధ్య 113 కిలోమీటర్లు ప్రవహించి మంచిర్యాల, కరీంనగర్​ జిల్లాల గుండా  జయశంకర్​ భూపాలపల్లిలోని కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది. అందుకే  తెలంగాణలో ఈ నది జన్మస్థానమైన తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలం అర్జునగుట్టతో  పాటు కాళేశ్వరం వద్ద ప్రాణహిత పుష్కరాలు ఘనంగా జరుపుతారు.

పుష్కర చరిత్ర

వేల సంవత్సరాల కిందట ముద్గలుడు అనే ముని శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. అది మెచ్చిన పరమశివుడు ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. అప్పుడు ముద్గలుడు.. తనని శివుడిలో ఐక్యం చేసుకోమని అడుగుతాడు. అలా ముద్గలుడు  శివుడి స్వరూపాలలో ఒకటైన జలరూపంలో కలిసి పుష్కరుడు అవుతాడు. బ్రహ్మదేవుడు ఆ విషయం తెలుసుకుని శివుడి అనుగ్రహంతో పుష్కరుడుని తన కమండలంలో నివసించేటట్టు చేసుకుంటాడు. అది గమనించిన దేవగురువైన బృహస్పతి, లోక కల్యాణం కోసం పుష్కరుడిని ప్రసాదించమని బ్రహ్మదేవుడికి పూజలు చేస్తాడు. కానీ పుష్కరుడు బ్రహ్మను విడిచి వెళ్లడానికి ఒప్పుకోడు. దాంతో బ్రహ్మదేవుడు ఒక నియమాన్ని పెడతాడు. బృహస్పతి  పన్నెండు రాశుల్లో ప్రవేశించే, నిష్ర్కమించే పన్నెండు రోజులు తనతో పాటు సమస్త దేవతలు ఆ రాశికి సంబంధించిన నదుల్లో నివాసం ఉంటామని చెప్పాడు. అలా పుష్కరుడు ముక్కోటి దేవతలకు అధిపతి అయ్యాడు. అప్పట్నించీ బృహస్పతి ఏడాదికోసారి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు జరుపుతున్నారు. ఒక సంవత్సరం పాటు ఉండే పుష్కర కాలంలో మొదటి 12 రోజుల్ని ఆది పుష్కరమని, చివరి 12 రోజుల్ని అంత్య పుష్కరమని పిలుస్తారు. 

పుష్కరస్నానం

పుష్కర సమయంలో దేవతలంతా పుష్కరుడితో పాటు నదిలో ప్రవేశిస్తారు. దేవతలు కొలువైన ఆ నీళ్లలో మునగడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ పోతాయట. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది. మోక్షప్రాప్తి  కలుగుతుందని పురాణాలు  చెప్తున్నాయి. అలాగే  పుష్కరాల్లో ఆడపడుచులు  నదికి చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె , మెట్టెలు వాయినంగా ఇస్తుంటారు.  

ఇలా వెళ్లాలి...

ప్రాణహిత నదికి మంచిర్యాల వరకు రైల్లో లేదా బస్సులో వెళ్లొచ్చు.  అక్కడి నుంచి 37 కి.మీ దూరంలో ఉన్న చెన్నూర్ చేరుకోవాలి. చెన్నూర్ నుంచి మరో 19 కి.మీ మహారాష్ట్ర సరిహద్దు వరకు వెళ్తుంటే మధ్యలో ఉన్న అర్జునగుట్ట వద్ద ప్రాణహిత కనిపిస్తుంది. అక్కడ పుష్కర స్నానాలు చేయొచ్చు. 
చెన్నూర్ నుంచి నేరుగా వేమన పల్లి వరకు 36కి.మీ ప్రయాణిస్తే అక్కడ కూడా ప్రాణహిత నది పుష్కర స్నానం ఆచరించొచ్చు. 

ముక్కోటి దేవతల అనుగ్రహం... 

పుష్కరాలప్పుడు మూడున్నర కోట్ల దేవతలు నదిలో నివాసం ఉంటారు. అందుకే ఆ నీళ్లలో పుష్కర స్నానం చేసే ముందు జన్మ ప్రభృతి యత్‌‌పాపం స్త్రీయా వా పురుషేణ వా  పుష్కరే స్నాన మాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి అనే మంత్రాన్ని జపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహంతో పాటు ఎంతో పుణ్యం దక్కుతుంది. పుష్కరాల్లో  మొదటి రోజున పూర్వీకులకు హిరణ్య శ్రాద్ధం, తొమ్మిదో రోజు అన్న శ్రాద్ధం, పన్నెండో రోజు ఆమశ్రాద్ధం చేయడంవల్ల పితరులు తృప్తి చెంది  ఆశీస్సులు అందిస్తారు. 
- చక్రపాణి నరసింహమూర్తి, ఖానాపూర్
::: సురేష్​ చౌదరి, మంచిర్యాల, వెలుగు