
ఆసిఫాబాద్/ కాగజ్ నగర్, వెలుగు: సరైన రవాణా వ్యవస్థ లేక పురిటి నొప్పులతో ఓ గర్భిణి నరకయాతన పడ్డది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన పద్మకు గురువారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి దిందా వాగు ఉప్పొంగడంతో రోడ్డు దాటి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది.
కుటుంబసభ్యులు ఆమెను ఎలాగో ఆటోలో వాగు సమీపంలోకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి వాగు వరకు సుమారు కిలోమీటర్ నడిపించారు. అతి కష్టం మీద నాటు పడవలో వాగు దాటించారు. కానీ అంబులెన్స్ రాకపోవడంతో రెండు గంటలపాటు పురిటి నొప్పులతో వాగు ఒడ్డున ఎదురుచూసిందామె. చివరికి అంబులెన్స్ రావడంతో తీసుకువెళ్లి దవాఖానాలో చేర్పించారు. శుక్రవారం ఆమెకు డెలివరీ చేయనున్నారు.